అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షర్మన్ పిలుపు
వాషింగ్టన్: లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర ముఠాలను పాక్ అణిచివేయాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడితో ఈ బృందాలకు సంబంధం ఉన్నట్టు ఆరోపించారు. భారతీయ ఎంబసీ ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో ఆయన మాట్లాడారు. ‘హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ పేరిట భారత రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉగ్రవాదం వల్ల సామాన్యులకు కలిగే నష్టం గురించి షర్మన్ ప్రసంగించారు. పహల్గాం దాడిని గుర్తు చేసుకుంటూ… ‘అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. మతాన్ని దృష్టిలోపెట్టుకొని దాడి చేశారు. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. పహల్గాం ఘటనతో సంబంధం ఉన్న లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రబృందాలను అణిచివేయాలని మనందరం కలిసి డిమాండ్ చేద్దాం’ అని బ్రాడ్ షర్మన్ పిలుపునిచ్చారు. ఈ డిజిటల్ ఎగ్జిబిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడులను ప్రదర్శించారు. 1993లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లు, 2008లో ముంబయిలో ఉగ్రదాడి, పహల్గాం దాడికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. అమెరికాలో భారత రాయబారిగా వ్యవహరిస్తోన్న వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ ‘మనందరం కొన్ని విషయాలు గుర్తుచేసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశాం. ఉగ్రవాదం మన సమాజానికి అపార నష్టం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒక్కటై ఐకమత్యంతో మెలగాలి. ఉగ్రవాదం అనే భూతాన్ని తరిమికొట్టాలి’ అని పేర్కొన్నారు.


