పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.
ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్‌కు ముందు రాత్రి రాయ్‌పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఘటనలో కనీసం నలుగురు గాయపడ్డారు. సీపీఐ(ఎం) కార్యకర్త రకీబుల్ అన్సారీ తీవ్రంగా గాయపడడంతో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి తరలించారు. తమ కార్యకర్తలపై దాడి జరిగిందని సీపీఐ(ఎం) ఆరోపిస్తుండగా, టీఎంసీ కూడా తమకు చెందిన ఇద్దరు గాయపడ్డారని తెలిపింది.
ఇదిలా ఉండగా 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశలో 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది.
ఈ దశలో సుమారు 3.60 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది.


