. తీరని డీజిల్, పెట్రోల్ వెతలు
. కొనసాగుతున్న ‘నో స్టాక’ బోర్డులు
. బారులు తీరుతున్న వాహనాలు
. ఫలితమివ్వని సీఎం సమీక్షలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. అరకొర సరఫరాతో వాహన దారులతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల ఎదుట చిన్నా పెద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపిస్తున్నాయి. డీజిల్ కొరతతో కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంత రైతాంగం సహా రాయలసీమ నిమ్మ పంట రైతులు కూడా విలవిల లాడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా…చాలా జిల్లాల్లో 50 నుంచి 70 శాతం వరకు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహన దారుల ఇబ్బందులు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎర్రటి ఎండలో సైతం కిలోమీటర్ల మేర తమ వాహనాలతో బారులు తీరుతున్నారు. మరోవైపు డీజిల్ కొరతతో రైతులు, మత్య్సకారులు, ఆటో కార్మికులు అల్లాడిపోతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం ఒక్కసారిగా 50 శాతం పైగా పెరిగింది. ఒక వైపు సీఎం చంద్రబాబు ఈనెల 26వ తేదీన ముంబై నుంచి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి…ఎక్కడా పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం తన ఇంటి నుంచి పెట్రోలు కంపెనీలు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి… సోమ వారం నుంచి ఎక్కడా నో స్టాక్ బోర్డులు ఉండకూడదంటూ ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పులేదు. ఎక్కడా డిమాండ్ తగినవిధంగా పెట్రోలు, డీజిల్ లభ్యమయ్యే పరిస్థితులు లేవు. జిల్లాల్లో యథాతథంగా నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోపక్క పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ఎక్కడా పెట్రోలు, డీజిల్ కొరత లేదంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది. క్షేత్ర స్థాయిలో వాహన చోదకులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చాలా చోట్ల కృత్రిమ ఇంధన కొరత సృష్టించి… డీలర్లతో కుమ్మక్కయ్యారన్న విమర్శలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ధ్వజమెత్తుతున్నాయి. పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరతను కూటమి నేతలు సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ సమస్యపై అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
సమస్య ఇదే..పరిష్కారం ఎక్కడ ?
రిటైల్ ఔట్ లెట్ల వద్ద వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు కొనసాగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సాధారణగా రోజుకు 6,330 కిలో లీటర్ల (కేఎల్) పెట్రోలు విక్రయాలు జరిగేవి. ఈనెల 25వ తేదీన ఒక్కసారిగా 34 శాతం డిమాండ్ పెరిగి 8,489 కేఎల్‌కు అమ్మకాలు చేరాయి. 26వ తేదీన సాధారణ డిమాండ్ కన్నా 22 శాతం అధికంగా 7,750 కేఎల్ వినియోగం ఉంది. మరోవైపు డీజిల్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణగా డీజిల్ రోజుకు 9,048 కేఎల్ విక్రయాలు జరిగేవి. 25వ తేదీన ఒక్కసారిగా 16 శాతం డిమాండ్ పెరిగి 10,556 కేఎల్‌కు విక్రయాలు చేరాయి. 26వ తేదీన సాధారణ డిమాండ్ కన్నా 3 శాతం అధికంగా 9,392 కేఎల్ వినియోగం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లూ తమ కంపెనీ బంకులకు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసినట్లు కలెక్టర్లు సీఎంకు నివేదించారు. ఎన్నికల తర్వాత ధరలు పెంచుకోవచ్చని కుట్రపూరితంగా ఆయిల్ కంపెనీలు 10 నుంచి 40 శాతం సరఫరాను తగ్గించడంతో వాహన దారులు, రైతులు ఎగుమతి, దిగుమతి రవాణా రెండు రోజుల నుంచి తీవ్రంగా ప్రభావితం అయ్యింది. భారీ నష్టాలు వస్తున్నాయని, అమ్మకాలను నియంత్రిం చాలని బంకు యజమానులకు నాలుగు రోజు లుగా కంపెనీలు మెసేజ్‌లు పంపిస్తూ ఇండెంట్ ప్రకారం సరఫరా చేయకుండా సమస్యను సృష్టించారన్న వాదనలున్నాయి. తమ లాభాల కోసం ప్రైవేట్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయన్న విమర్శలున్నాయి. అటు యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల నుంచి ప్రజలకు ఇబ్బందులు కొనసాగ కుండా చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారానికి డిమాండ్‌కు తగిన విధంగా ఇంధన సరఫరా ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


