. తిరుపతిలో సీపీఐ నేతల వినూత్న నిరసన
. హాజరైన నారాయణ, ఈశ్వరయ్య
విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: ఏపీలో పెట్రోలు, డీజిల్ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషను ఛైర్మన్ డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండు చేశారు. తిరుపతిలో సోమవారం సీపీఐ నేతలతో కలసి పెట్రోలు బంకుల వద్ద వారు నిరసన తెలిపారు. అంతకు మునుపు నగరంలోని వైఎసఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డులోని పెట్రోలు బంకు వరకు పెట్రోలు లేని ఆటో లాగుతూ వినూత్న నిరసన తెలియ చేశారు. ఈ సందర్భంగా కే నారాయణ మాట్లాడుతూ… “రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత విపరీతంగా పెరిగిపోయి, వాహనదారులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. తిరుపతి వంటి నగరంలో కూడా ఈ స్థాయి స్కేర్సిటీ ఉండటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇంధన కొరత వస్తుందని ముందే తెలిసినప్పటికీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బానిసగా వ్యవహరిస్తుంటే, మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బానిసగా మారి భజన చేస్తున్నారు. ఈ భజనలో పడి ప్రజల కష్టాలను, భవిష్యత్తు అవసరాలను ప్రభుత్వం విస్మరించడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. కేవలం వాహనదారులే కాకుండా, రైతాంగం కూడా డీజిల్ దొరక్క అల్లాడిపోతున్నారు. ట్రాక్టర్లు నడవక, ముఖ్యంగా రాయలసీమలో నిమ్మ తోటలకు నీళ్లు పోయలేక చెట్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గోదావరి డెల్టా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధనం, గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు” అని నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను తక్షణమే నివారించాలని సీపీఐ తరపున నారాయణ డిమాండ్ చేశారు. ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ అనుబంధ ప్రజా సంఘాలు, రైతులు, కార్మికులు, విద్యార్థి యువజనులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన హెచ్చరించారు.
ఇంధన సమస్యను పరిష్కరించండి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ… “రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమై వాహనదారులు, రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత విపరీతంగా పెరిగిపోయింది. వాహనదారులు గంటల తరబడి బంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. తిరుపతి వంటి మహానగరంలో కూడా ఇంధనం దొరకని పరిస్థితి ఉందంటే పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం సమీక్షలకే పరిమితమైంది. కొరత వస్తుందని ముందే తెలిసినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది. ఒకపక్క ప్రభుత్వం కొరత లేదని ప్రకటనలు ఇస్తోంది కానీ, క్షేత్రస్థాయిలో బంకుల వద్ద ‘నో స్టాక’ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం వాహనాలే కాదు, వ్యవసాయ రంగం కుదేలైంది. గోదావరి డెల్టాలో సాగు పనులు ఆగిపోయాయి. రాయలసీమలో డీజిల్ లేక ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోయలేక నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. అన్నదాతలు కళ్లముందే పంట ఎండిపోతుంటే కన్నీరు పెడుతున్నారు. ఇంధన కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభిస్తోంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. గ్యాస్ కొరతతో హోటళ్లు, చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫలితంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి భజన చేయడంలో ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు ప్రజల కష్టాల మీద లేదు. ఇప్పటికైనా ఈ ఇంధన సమస్యను అత్యవసర పరిస్థితిగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ హరినాథ్ రెడ్డి, జగదీష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్, ఉదయ్, చలపతి, రవి, ప్రజా సంఘాల నాయకులు శివారెడ్డి, ఎన్ డి రవి, రాజా, శివ, మంజుల, శ్రీరాములు, గోవిందస్వామి, ప్రవీణ్, నాగరాజు, చారులత తదితరులు పాల్గొన్నారు.


