లక్షలాది కార్మికుల ఉపాధికి గండి
మహిళా బిల్లు పేరిట రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
. మోదీ సర్కారుపై నిప్పులుచెరిగిన అమర్జిత్ కౌర్
. సంఘటిత పోరాటాలే సమస్యలకు పరిష్కారమని వెల్లడి
. ఇప్పటికైనా చంద్రబాబు, నితీశ్ కళ్లు తెరవాలని హితవు
విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: దేశంలో అట్టడుగు వర్గాలు లబ్ధి పొందుతున్న సంక్షేమ పథకాలకు క్రమంగా కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోందని ఏఐటీయÖసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాల అమల నుంచి కేంద్రం తప్పుకోవాలని భావిస్తోందని చెప్పారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, ఆశావర్కర్ల విధులు, మధ్యాహ్న భోజన పథకం అమలులో తన వాటాను కేంద్రం తగ్గించుకుంటూ వస్తోందని, భవిష్యత్తులో ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి ఏమిటో మనకు తెలుసు అని చెబుతూ భవిష్యత్తులో ఈ పథకాలు ఉండవని హెచ్చరించారు. దీంతో ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయÖసీ 18 వ రాష్ట్ర మహాసభల లో భాగంగా సోమవారం ఉదయం ప్రతినిధుల మహాసభలు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఏఐటీయూసీ జెండాను రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు నివాళులు అర్పించారు. ప్రతినిధుల మహాసభకు అధ్యక్ష వర్గంగా ఆర్ రవీంద్రనాథ్, కే రాధాకృష్ణ, ప్రేమ, దామోదర రావు, సాంబశివరావు వ్యవహరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి గత మహాసభల నుండి ఈ మహాసభల వరకు మృతి చెందిన వారికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు పీ హరినాథరెడ్డి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అమర్జిత్కౌర్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, రంగు, వేసుకునే దుస్తులు ఆధారంగా ప్రజలను విభజించే నాయకులకు అధికారం దూరం చేయాలని పిలుపునిచ్చారు. వాస్తవంగా గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓడిపోయారని చెబుతూ చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్ మద్దతుతో మళ్లీ ప్రధాని అయ్యారన్నారు. ఈ ఇద్దరు నాయకులు ఇప్పటికైనా ప్రధాని పోకడలను గుడ్డిగా సమర్థించకుండా, తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం వెనుక పౌరసత్వం రద్దు కుట్ర ఉందని హెచ్చరించారు. మహిళా బిల్లు పేరిట నియోజకవర్గాలను పునర్ విభజించి, అత్యధిక సీట్లు పొందడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నిస్తున్నారని హెచ్చరించారు. అమెరికాలో ట్రంప్ మీద కాల్పుల ఘటన హత్యాయత్నం కాదని… అది ఒక నాటకమని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు కూడా ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాన్ని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలే మన దేశంలో కూడా ఎన్నికల ముందు జరుగుతుంటాయని… తద్వారా సానుభూతితో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకుంటారని విమర్శించారు. పెట్టుబడిదారీ విధానంలో కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే అమెరికా వంటి దేశాలకు ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒకచోట యుద్ధాలు, అలజడులు జరుగుతూ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. వాయు, జల, రోడ్డు మార్గాలపైనే కాకుండా సహజ వనరులపై సైతం ఆధిపత్యం నిలుపుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్నారు. మధ్య ఆసియా దేశాలపై పెత్తనాన్ని నెతన్యాహుకు అప్పగించేందుకు ఇరాన్ పై ట్రంప్ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇరాన్ పై యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగు రోజులగా పెట్రోల్, డీజిల్ లేక ప్రజలు అల్లాడుతుంటే…చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతరులపై నెట్టివేస్తున్నారని చెప్పారు. ఈ సంక్షోభం వల్ల ప్రధానంగా నష్టపోతోంది వీధి వ్యాపారులు, రైతులు, కార్మికులు, రవాణా రంగంలోని డ్రైవర్లు, చిరు ఉద్యోగులేనన్నారు. లక్షలాదిమంది సాధారణ ప్రజల జీవనోపాధిపై ఇంధన సంక్షోభ ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా కనీస వేతనాలను పెంచని కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లుగా ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి… వారి హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్ లు రూపంలో చట్టాలను తెచ్చిందని వివరించారు. తాజా చట్టాలను రద్దుచేసి పాత చట్టాలు అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలతో ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని కార్మిక సంఘాలను, కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లాలని కోరారు. ఇందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మహాసభల్లో చర్చించాలని సూచించారు. తాజాగా కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లలో మానవీయత లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం మనుషులమని…బానిసలం, జంతువులం కాదని హెచ్చరించారు. మనుషులంతా ఒక్కటేనని వీధుల్లోకి వచ్చి ఎర్రజెండా నీడన పోరాటం చేయడం ద్వారా పాత చట్టాలను మళ్లీ సాధించుకోవచ్చునని చెప్పారు. ఏఐటీయÖసీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు 126 సంవత్సరాల్లో కార్మికులు, రైతులు, రైతు కూలీలు, అసంఘటిత రంగంలోని ఉద్యోగులు తదితరుల హక్కుల సాధనకు ఎన్నో ఉద్యమాలు చేసిందని వివరించారు. హిట్లర్ జాతీయవాదంతో జరిగిన దారుణాలు చరిత్రలో చూశామని చెబుతూ…ప్రస్తుతం మనదేశంలో కూడా ఆరఎసఎస్, మోదీ ఆర్య సిద్ధాంతాన్ని తలకెత్తుకున్నారని విమర్శించారు. విదేశీ చొరబాటు దారుల పేరిట ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ధోరణి దేశానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రజెండా పార్టీ పతాకం మాత్రమే కాదని చెబుతూ అదొక భావోద్వేగమని చరిత్ర వివరించారు. సంఘటిత పోరాటాలతో కార్పొరేట్ వర్గాల కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలను గద్దె దింపాలని… ఇందుకు కార్మిక వర్గం ఏకతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు.
ప్రతినిధుల మహాసభలో పలు కమిటీ లను ఎంపిక చేశారు. తీర్మానాల కమిటీలో రాజారెడ్డి, కొండలరావు, గిరి, సుబ్బరాయుడు, మునెప్ప ఉన్నారు. అర్హతల కమిటీ కమిటీలో బాల కాశి, లలితమ్మ, రమణ, పుల్లారావు, రాంబాబు, అమర్ ఉన్నారు. మినిట్స్ కమిటీలో రమేష్ బాబు, స్రవంతి, లెనిన్ బాబు, బాదుల్లా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య, ఏఐటీయÖసీ జాతీయ కార్యదర్శి జీ ఓబులేసు, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీశ్, సీఐటీయÖ రాష్ట్ర అధ్యక్షులు నర్సింగరావు, అమరావతి జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామానాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


