Homeఅంతర్జాతీయంహోర్మూజ్ జలసంధిని తెరిచేందుకుఇరాన్ మూడు షరతులు

హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకుఇరాన్ మూడు షరతులు

- Advertisement -

. నౌకా దిగ్బంధం ఎత్తివేత, అణు చర్చల వాయిదా ప్రధాన డిమాండ్లు
. అణు చర్చల వాయిదాను వ్యతిరేకిస్తున్న ట్రంప్

తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ సమ్మతించింది. అయితే ఇందుకు మÖడు షరతులు విధించింది. ఈ మేరకు ఒమన్, పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా తెహ్రాన్ తన ప్రణాళికను అమెరికాకు పంపింది. అయితే, ఇరాన్ పెట్టిన షరతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్యవర్తిత్వ దేశాల ద్వారా అమెరికాకు మూడు షరతులతో కూడిన ప్రతిపాదనను పంపారు. వీటిలో మొదటిది, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధాన్ని ముగించడం, మళ్లీ ఇరాన్‌పై దాడులు జరగవు అనే హామీలను పొందడం. రెండోది, ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడం, హోర్మూజ్ జలసంధిని తెరవడం. మూడోది, మొదటి రెండు పాయింట్లూ అమల్లోకి వచ్చాక తమ అణ్వస్త్ర కార్యక్రమం, సంవర్ధిత యురేనియం హక్కులపై అమెరికాతో చర్చలను మొదలుపెడతామని ఇరాన్ ప్రతిపాదించింది. అంతర్జాతీయ అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనలపై చర్చించేందుకు తన సలహాదారులతో ట్రంప్ తాజాగా సమావేశమైనట్లు తెలిసింది. అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరగనిదే, మిగతా అంశాలపై ఇరాన్‌తో చర్చలను మొదలుపెట్టలేమని ట్రంప్ తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇరాన్ ప్రతిపాదించిన క్రమంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేమని ట్రంప్ స్పష్టం చేశారని పేర్కొన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకోకుండా నిరోధించడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంతోనే ఆయన యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఇరాన్ ప్రతిపాదనలో అణు చర్చలను వాయిదా వేయాలన్న నిబంధన ఉండటమే ట్రంప్ అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా స్పందించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని మినహాయించి ఎలాంటి ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. “ఏ ఒప్పందం జరిగినా, అది ఇరాన్‌ను అణ్వాయుధం వైపు వెళ్లకుండా కచ్చితంగా నిరోధించేలా ఉండాలి” అని ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం అమెరికా`ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉంది. అయితే, ప్రపంచ వాణిజ్యంలో ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా అయ్యే హోర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇది ట్రంప్‌పై రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు, అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు కూడా తమ ఎగుమతుల కోసం ఇదే మార్గాన్ని ఉపయోగిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దిగ్బంధనం వల్ల ఎరువులు, ఆహారం, ఇతర నిత్యావసరాల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడంతో పలు దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరుపక్షాలు తమ పంతాలు వీడకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఇరాన్‌కు ఉపాధ్యక్ష పదవిపై అమెరికా అభ్యంతరం
ఏప్రిల్ 27న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌పీటీ)పై 11వ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సదస్సు ప్రారంభంలో ఇరాన్ అణ్వస్త్ర ఆశయాల విషయంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. అలీన ఉద్యమ దేశాల కూటమి తరఫున ఎన్నికైన 34 మంది ఉపాధ్యక్షులలో ఇరాన్ ప్రతినిధి కూడా ఉండటం అనేది ఈ వివాదానికి కారణమైంది. ఈ నిర్ణయాన్ని అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వ్యతిరేకించాయి. ఎన్‌పీటీ ఒప్పందాన్ని ధిక్కరించిన ఇరాన్‌ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడంపై అమెరికా అభ్యంతరం తెలిపింది. ఇరాన్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకోవడాన్ని రష్యా వ్యతిరేకించింది. అమెరికా ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవని ఇరాన్ రాయబారి రెజా నజాఫీ చెప్పారు.
ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో లావాదేవీలు జరిపితే ఆంక్షలు: అమెరికా
ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. ఇరాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలకు అమెరికా ట్రెజరీ సూచించింది. అలాకాక ఎవరైనా లావాదేవీలు జరిపితే.. వారు కూడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ‘ఎక్స’లో పోస్టు పెట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు