Homeసినిమాతగ్గేదేలే అంటోన్న ‘ఆ నలుగురు’

తగ్గేదేలే అంటోన్న ‘ఆ నలుగురు’

- Advertisement -

కొత్త చిత్రాలతో బిజీబిజీగా ఉన్న సీనియర్ స్టార్లు

హైదరాబాద్: తెలుగు సినిమాకి నాలుగు మూలస్తంభాలు… చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. వందలకొద్దీ సినిమాలు చేసిన వీళ్లు పరిశ్రమ స్థాయిని పెంచారనే చెప్పాలి. దశాబ్దాలు గడుస్తున్నా…తరాలు మారుతున్నా…తరగని ఆకర్షణ శక్తి వీరి సొంతం. మన ప్రేక్షకులకు వీళ్ల సినిమాలు కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఓ ప్రత్యేకమైన భావోద్వేగం. దర్శకనిర్మాతలు కథలతో వరుస కట్టడానికి కారణం అదే! ఒకపక్క నవతరం హీరోలు రకరకాల ప్రయోగాలతో ప్రభావం చూపిస్తున్నా సరే… వాళ్లకి దీటుగా సినిమాలు చేస్తున్నారు సీనియర్లు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోలూ కొత్త సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా ముందుకు దూసుకుపోతున్నారు…
తనకున్న అపారమైన అనుభవంతో కథల్ని ఎంపిక చేసుకుంటూ…పక్కా ప్రణాళికలతో సినిమాలను ముందుకు నడిపిస్తుంటారు చిరంజీవి. దర్శకుడు చెప్పింది చేసుకుంటూ సినిమాని పరుగులు పెట్టిస్తుంటారు బాలకృష్ణ. టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ పక్కాగా సినిమాలు చేస్తుంటారు నాగార్జున. కథానాయకులు అస్సలు ఖాళీగా ఉండకూడదని చెబుతుంటారు వెంకటేశ్. ఇలా ఈ నలుగురు సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు.
చిరు లుక్ టెస్ట్ పూర్తి…
‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అదే ఉత్సాహంతో కొత్త సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి కొత్త సినిమా తెరకెక్కబోతోంది. ఇదివరకు ఈ కలయికలో ‘వాల్తేరు వీరయ్య’ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి మాస్ అంశాలతో కూడిన పక్కా కమర్షియల్ కథని సిద్ధం చేశారు బాబీ. అందుకోసం ఇటీవలే లుక్ టెస్ట్‌ని పూర్తి చేశారు. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇక పట్టాలెక్కడమే ఆలస్యం. ఈ సినిమా పూర్తయ్యాక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా రూపొందనుంది.
రెండు సినిమాలతో బాలయ్య బిజీ…
ఒక పక్క రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ తన సినిమాల్ని పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తుంటారు అగ్ర హీరో బాలకృష్ణ. ఆయన విరామం లేకుండా సినిమాలు చేస్తుంటారు. ఈసారి అయితే రెండు సినిమాల్ని సమాంతరంగా ముందుకు నడిపించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమానీ చేయడానికి అంగీకారం తెలిపారు బాలకృష్ణ. ఈ రెండు సినిమాల చిత్రీకరణలను సమాంతరంగా నడిపించనున్నారు బాలయ్య.
100 సినిమాల మైలురాయిని చేరుకున్న నాగ్…
నాగార్జున వంద సినిమాల మైలురాయిని అందుకున్నారు. కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమా ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ చేసుకొంటోంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ నాయిక టబు నటిస్తున్నారు. ఆమెతోపాటు మరికొందరు కథానాయికలూ ఇందులో ఉంటారని సమాచారం. ఇందులోనూ నాగార్జున భిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాత కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది. అందులో అక్కినేని కుటుంబ కథానాయకులంతా కలిసి సందడి చేసే అవకాశాలున్నట్టు సమాచారం.
విరామంలేని వెంకీ…
మరో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ గతేడాది చేసింది ఒక్క సినిమానే. ఈసారి మాత్రం విరామం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం: 47’ (ఏకే 47) చేస్తున్నారు. చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు వెంకీ. అందులో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కథానాయకులు. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్‌తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు