మాస్కో: నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది. యూరప్ లో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని సృష్టించిన ఈ యుద్ధం త్వరలోనే ముగియనుంది. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన వేలాది మంది సైనికులు మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత రక్తపాతం సృష్టించిన యుద్ధం ఇదే. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగింపు దశకు వస్తోందని అన్నారు. మాస్కోలో జరుగుతున్న రష్యా విజయోత్సవ దిన వేడుకల్లో భాగంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో యుద్ధం విరమించడానికి సంప్రదింపుల కోసం సిద్ధమైనట్లు రష్యా సంకేతాలు ఇచ్చినట్లైంది. అయితే యుద్ధం ముగింపునకు సంబంధించి ఎటువంటి కాలపరిమితి, శాంతి ఒప్పందాన్ని పుతిన్ ప్రకటించలేదు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా రష్యా వైపు మరలింది.
ట్రంప్ చర్చలు ఫలించేనా!
తన అభ్యర్థనతో రష్యా, ఉక్రెయిన్‌లు మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపునకు చర్చలు సాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఆ దిశగా ట్రంప్ పుతిన్, జెలెస్కీలతో చర్చలు జరిపారు. ఆ మరునాడే పుతిన్ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి.
ఉక్రెయిన్ నుంచి ముప్ప్పు ఉండవచ్చనే నేపథ్యంలో గతానికి భిన్నంగా రష్యా ఈసారి విజయోత్సవ దినం వేడుక(విక్టరీ డే సెలబ్రేషన్స్)ను అత్యంత భద్రత మధ్య అతి సాధారణంగా నిర్వహించింది. ఈ పరేడ్‌లో రెడ్‌స్క్వేర్‌పై రష్యా ఎలాంటి ట్యాంకులను, ఆయుధాలను ప్రదర్శించలేదు. కేవలం భారీ తెరలపై, డిజిటల్ స్క్రీన్లలో అధునాతన క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లను ప్రదర్శించింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు కవాతు నిర్వహించారు. ఉత్తర కొరియా బలగాలు సైతం ఈ కవాతులో పాల్గొన్నాయి. ఇక ఉక్రెయిన్‌తో శాశ్వత శాంతి ఒప్పందం కుదిరన తర్వాతే తాను జెలెన్‌స్కీతో నేరుగా భేటీ అవుతానని పుతిన్ అన్నారు.
ముగింపు దశకు రష్యా…ఉక్రెయిన్ యుద్ధం!
- Advertisement -


