అధికారుల మొద్దు నిద్ర
(విశాలాంధ్ర-చిత్తూరు)
చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక గంగినేని చెరువు కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కోరల్లో చిక్కుకుంది. సుమారు రూ.50 కోట్లకు పైగా విలువ చేసే చెరువు భూములను కొల్లగొట్టేందుకు బడా బాబులు బరితెగిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగర ప్రజలకు ఒకప్పుడు సాగునీరు, తాగునీరు అందించిన ఈ చెరువు విస్తీర్ణం రికార్డుల ప్రకారం 62 ఎకరాలు. చెరువుకు సంబంధించిన 0.61 సెట్ల భూమిని కొందరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు బోగస్ రికార్డులు సృష్టించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ కనీసం 50 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని అంచనా.
రికార్డుల తారుమారు
కబ్జాదారులకు అనుకూలంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్ 685 లోని 0.61 సెట్ల భూమిని ప్రభుత్వ బీడు భూమిగా రికార్డులు పేర్కొంటున్నా, మరికొన్ని రికార్డుల్లో మాత్రం ఇది గంగినేని చెరువు బఫర్ జోన్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. అయినప్పటికీ, 1976లోనే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించడంలో కొందరు రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
దర్జాగా కంచెలు
నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములకు కంచెలు వేసి, రేకులతో షెడ్లు మరియు దుకాణాలను నిర్మిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ప్రతిరోజూ జిల్లా అధికార యంత్రాంగం ఈ చెరువు మీదుగానే రాకపోకలు సాగిస్తున్నా, కళ్ళముందే జరుగుతున్న ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన గంగినేని చెరువును కాపాడాలని, తప్పుడు రికార్డులపై విచారణ జరిపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


