ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ
*కార్పొరేట్ మాఫియా గుప్పిట్లో విద్యావ్యవస్థ
*నిద్రమత్తులో అధికార యంత్రాంగం
(విశాలాంధ్ర-చిత్తూరు)
జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. విద్యను సేవా భావంతో కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చిన కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 80 శాతం సంస్థలు కనీస అనుమతులు లేకుండానే దర్జాగా కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. ప్రతి కళాశాలకు అగ్నిమాపక, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్న నిబంధన ఉన్నా మెజారిటీ కళాశాలలు వీటిని గాలికొదిలేశాయి. బహుళ అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కనీస క్రీడా మైదానాలు, సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగితాలకే పరిమితమైన ప్రయోగశాలలు
సైన్స్ విద్యార్థులకు కీలకమైన ప్రయోగశాలలు చాలా కళాశాలల్లో రికార్డులకే పరిమితమయ్యాయి. పరీక్షల సమయంలో అద్దె సామాగ్రితో మమ అనిపిస్తూ, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌లు లేకపోయినా వోకేషనల్ కోర్సుల పేరుతో భారీగా ఫీజులు దండుకుంటున్నారు.
అధ్యాపకులపై ‘అడ్మిషన్ల’ వేధింపులు
పాఠాలు బోధించాల్సిన అధ్యాపకులను యాజమాన్యాలు రోడ్లపైకి నెట్టాయి. “అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం” అంటూ నిరుద్యోగ అధ్యాపకులను తీవ్రంగా వేధిస్తున్నాయి. సెలవులు లేకుండా, ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారానికి పంపుతూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
యథేచ్చగా దోపిడీ
తక్కువ ఫీజుతో చేరుస్తామని ఆశ చూపి, తీరా చేరిన తర్వాత రీయింబర్స్మెంట్ నెపంతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. స్టేషనరీ పేరుతో అదనపు బాదుడు తప్పడం లేదు. కనీస ఫిట్నెస్ లేని బస్సులు, 55 ఏళ్లు దాటిన డ్రైవర్లతో విద్యార్థుల రవాణా అత్యంత ప్రమాదకరంగా మారింది. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నా రవాణా శాఖ పట్టించుకోవడం లేదు.
అధికారుల మౌనం ఎందుకో..?
రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలతోనే ఈ కార్పొరేట్ మాఫియా చెలరేగిపోతోందని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేని బ్రాంచ్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఇకనైనా నిద్రమత్తు వదిలి స్పందిస్తుందా? లేక విద్యార్థుల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుందా? వేచి చూడాలి.
అధికారులు కళ్లు తెరవాలి
రాజకీయ పలుకుబడితో చెలరేగిపోతున్న కార్పొరేట్ మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి రఘుపతి మాట్లాడుతూ.. సెలవుల్లో కళాశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మౌలిక వసతులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ఇకనైనా యంత్రాంగం నిద్రమత్తు వదిలి స్పందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


