Homeమోదీ వ్యాఖ్యల దుమారం… స్టాక్ మార్కెట్లు ఢమాల్

మోదీ వ్యాఖ్యల దుమారం… స్టాక్ మార్కెట్లు ఢమాల్

- Advertisement -

పసిడి షేర్లు పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. శాంతి ఒప్పందానికి ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడం, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి కారణాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికితోడు ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని పొదుపు చర్యలు దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టపోగా… నిఫ్టీ 23,850 దిగువన ముగిసింది. బీఎసఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.467 లక్షకు కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 76,638.09 (క్రితం ముగింపు 77,328.19) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,957.40 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1312.91 పాయింట్ల నష్టంతో 76,015.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 360.30 పాయింట్ల నష్టంతో 23,815.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.34 గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 103 డాలర్ల వద్ద కొనసాగుతుండగా… బంగారం ఔన్సు 4666 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఆర్థిక వృద్ధిని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 డాలర్లకు చేరడం ప్రభావం చూపింది. దిగుమతులపై ఆధారపడే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రతికూల అంశం కావడం గమనార్హం. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీనికితోడు విదేశీ పెట్టుబడులు తరలిపోవడమూ ప్రభావం చూపింది. ఇక బంగారంపై మోదీ చేసిన వ్యాఖ్యలు పసిడి షేర్లు భారీగా పతనం కావడానికి కారణమయ్యాయి. ‘ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని… ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపివేద్దామని, పసిడి దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది’ అని ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, అలాగే విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్‌లు తగ్గించుకోవాలన్నారు. నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా వాడాలని.. వీలైనంతవరకు చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. దీంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో గోల్డ్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. టైటాన్ కంపెనీ షేర్ ఆరు శాతానికి పైగా పడిపోయి రూ.4,230కి చేరింది. ఇది మునుపటి ముగింపు ధర కంటే రూ.283.40 తక్కువ. దీంతోపాటు కల్యాణ్ జ్యువెలర్స్, సెంకో గోల్డ్ వంటి స్టాక్‌లు భారీగా పడిపోయాయి.
బంగారం బిల్లే 72 బిలియన్ డాలర్లు
ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి ఏడాది సుమారు 700-800 టన్నుల పుత్తడిని ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. కానీ దేశీయంగా కేవలం 1-2 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారు దిగుమతులు రికార్డు స్థాయిలో 72 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వస్తువుల ధరలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులలో అనిశ్చితి వల్ల భారత్ తన విదేశీ మారక నిల్వలపై ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. దీంతో ఇటీవల భారతదేశ విదేశీ మారక నిల్వలు 7.794 బిలియన్ డాలర్లు తగ్గి 690.693 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆ ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై పడే అవకాశం ఉంది.
నేడు మోదీని కలవనున్న జ్యువెలరీ అసోసియేషన్
మోదీ ప్రకటనపై దేశంలోని బంగారు వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై ప్రధానితో చర్చించడానికి మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నట్లు జ్యువెలరీ అసోసియేషన్ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు