సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీవీకే ప్రభుత్వం
ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని ఆదేశాలు
చెన్నై: తమిళనాడులో ఆదివారం విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. తొమ్మిది మంత్రులతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఏర్పడిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ 200 యÖనిట్ల లోపు ఉన్న గృహాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. రెండో రోజు మంగళవారం సంస్కరణల దిశగా అడుగులు వేశారు. ప్రార్ధనా మందిరాలు, పాఠశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు మÖసివేయాలని ఆదేశించారు. ఈ సంచలన నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు మÖతపడనున్నాయి. ఈ మేరకు మంగళవారం తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని పేర్కొంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ అధ్వర్యంలో నడుస్తున్న వాటన్నింటినీ రెండు వారాల్లోగా మూసివేయాలని ఆదేశించింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం… రాష్ట్రంలో మొత్తం 4,765 తస్మాక్ మద్యం రిటైల్ దుకాణాలు ఉన్నాయి. తాజాగా మూసివేయడానికి గుర్తించిన 717 దుకాణాల్లో… 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యాసంస్థలు, మరో 255 బస్స్టాండ్ల సమీపంలో ఉన్నాయి. సీఎం విజయ్ తాజా ఆదేశాలతో మరికొన్ని రోజుల్లో ఇవి మూతపడనున్నాయి. ఈ నిర్ణయంపై తమిళనాడులో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


