ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ అనేది ఒక రూల్్ణ అని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు గతంలో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన సొంత ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన గత ధర్మాసనం.. సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి సంబంధించిన పాత తీర్పులను, నిబంధనలను సరిగ్గా పాటించలేదని స్పష్టం చేసింది.జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు చిన్న బెంచ్‌లు కట్టుబడి ఉండాలని, వాటిని మార్చడం లేదా విస్మరించడం చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. గత జనవరిలో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అనుసరించిన విధానాన్ని అంగీకరింలేమని పేర్కొంది. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నప్పుడు.. కఠినమైన యూఏపీఏ చట్టం కింద కూడా నిందితుడికి బెయిల్ పొందే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది.
ప్రాథమిక విచారణలోనే కేసు నిజమని తేలితే.. విచారణ ఎన్ని ఏళ్లు సాగినా బెయిల్ ఇవ్వకూడదనే వాదనను సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ఇలాంటి పద్ధతిని అంగీకరిస్తే.. విచారణ పూర్తి కాకుండానే నిందితుడికి జైలు శిక్ష విధించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఆరు సంవత్సరాలుగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అనే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఈ తాజా ఆదేశాలు ఇచ్చింది.


