శాంతి చర్చల వేళ దాడులు
వాషింగ్టన్/తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా మళ్లీ విరుచుకుపడింది. ఒక వైపు యుద్ధ విరమణకు శాంతి చర్చలు జరుగుతున్న వేళ మరో వైపు ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై తీవ్రమైన దాడులు చేసింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణ కోసమే తాము ఇరాన్ క్షిపణి ప్రయోగ లాంచ్‌ప్యాడ్లు, సముద్రంలో మందుపాతరలు పరిచే బోట్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. హోర్మూజ్ వద్ద తాజాగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మైన్‌లను (సముద్రపు ల్యాండ్‌మైన్‌లు) మోహరించేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమోతీ హాకిన్స్ పేర్కొన్నారు. ప్రస్తుత సీజ్‌ఫైర్ సమయంలో అమెరికా దళాలు ఎంతో సంయమనం పాటిస్తూనే, తమ రక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నాయని హాకిన్స్ స్పష్టం చేశారు. తమ దేశానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధ నౌకలకు తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు ముప్ప్పుగా పరిణమించినట్లు వెల్లడించారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నేవీ బేస్ కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు.
నేడు దోహాలో చర్చలు..
అమెరికాతో పరోక్ష చర్చల్లో భాగంగా పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందం సోమవారం ఖతార్‌కు వెళ్లింది. అక్కడ కీలక సంప్రదింపులు జరిపింది. ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విలేకర్లతో మాట్లాడుతూ.. అమెరికాతో అత్యధిక అంశాలపై అవగాహన కుదిరిందన్నారు. అయితే చేయాల్సిన పని ఇంకొంత మిగిలేఉందని పేర్కొన్నారు. చర్చల్లో యుద్ధాన్ని పూర్తిగా (లెబనాన్‌లోనూ) ముగించడం పైనే తాము దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. అణ్వస్త్రాల గురించి ప్రస్తుతం మాట్లాడటం లేదన్నారు. యుద్ధం ముగింపుపై అవగాహన ఒప్పందం కుదిరితే… ఆపై 60 రోజుల వ్యవధిలో అణు సంబంధిత అంశాలపై చర్చలు జరుపుతామని చెప్పారు. యుద్ధం ముగింపుపై నేడు (మంగళవారం) ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్-అమెరికా దూతలు చర్చలు జరపనున్నారు.
ఇదిలా ఉంటే… ఇరాన్ వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియం లేదా అణు ధూళిని పూర్తిగా నశింపజేసేందుకు అమెరికాకు అప్పగించడానికి, పరస్పర అంగీకారం ఉన్న ఇతర సురక్షిత ప్రాంతంలో అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ సమక్షంలో నాశనం చేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తెహ్రాన్ తన పాత మొండి వైఖరిని సడలించి, శాంతి ఒప్పందానికి ముందుకు వస్తోందనడానికి ఇది ఒక సంకేతమని ఆయన అన్నారు. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేతపై ఇరు దేశాల మధ్య ఉన్న భాషాపరమైన భేదాల వల్ల ఈ చర్చలు మందగించగా, తాజా పరిణామంతో ఆ ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లు కనిపిస్తోంది.
అమెరికా వైఖరిలో మార్పుల వల్లే సంక్లిష్ట పరిస్థితులు: ఇరాన్
మరోవైపు, చర్చల్లో చాలా అంశాలపై ఒక ముగింపునకు వచ్చినప్పటికీ, ఒప్పందం త్వరలోనే జరిగిపోతుందని కచ్చితంగా చెప్పలేమని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ పేర్కొన్నారు. అమెరికా తరచూ తమ వైఖరిని మార్చుకుంటూ ఉండటం వల్ల చర్చల ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారుతోందని ఆయన ఆరోపించారు. ఏదైనా ఒప్పందం కుదిరితే అది ఇరు దేశాలకు ఎంతో అర్థవంతమైనదిగా ఉండాలని, లేనిపక్షంలో చర్చల నుంచి పూర్తిగా తప్ప్పుకుంటామని ట్రంప్ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ప్రస్తుతం దోహా వేదికగా ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో, హోర్ముజ్ జలసంధి వద్ద జరిగిన ఈ తాజా దాడులు ఈ చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.
ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా
- Advertisement -
RELATED ARTICLES


