న్యూదిల్లీ: అక్రమ వలసలు, ఇతర కారణాల వల్ల దేశంలో చోటుచేసుకుంటున్న అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. గతంలో ప్రధాని మోదీ ప్రకటన ఆధారంగా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేశామన్నారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెద్ద సవాలుగా మారిందని అమిత్షా చెప్పారు. కమిటీకి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నావోలేకర్ అధ్య క్షత వహిస్తారని, మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి సభ్యు లుగా ఉంటారని అమిత్షా తెలిపారు. దేశవ్యా ప్తంగా చోటుచేసుకుంటున్న జనాభా మార్పులపై సమగ్ర మూల్యాంకనం నిర్వహించడం, మత, సామాజిక వర్గాల స్థాయిల్లో జనాభా మార్పుల సరళిని విశ్లేషించడం ఈ కమిటీ కర్తవ్యమన్నారు. దేశంలో మారుతున్న జనాభా తీరుపై కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు.


