. ప్రజల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత
. ప్రజానాట్యమండలి మహాసభలో ఎమ్మెల్సీ కోదండరామ్
విశాలాంధ్ర- హైదరాబాద్: సమాజాన్ని మేల్కొలిపి, చైతన్యపరిచే విధంగా కళాకారులు తమ సాంస్కృతిక దృష్టి కోణాన్ని మలుచుకుని కళా రూపాలను రూపొందించాలని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండ రామ్ అన్నారు. సమస్య తీవ్రత తెలిసిన ప్ప్పుడే ఉద్యమం ఉప్పెనలా మారుతుందని, తద్వారా సమస్య పరిష్కారమవుతుంద న్నారు. కవి, రచయిత గూడ అంజయ్య రాసిన “దొర ఏందిరో… దొర పీకుడెందిరో” పాట ఒక శక్తిగా మారి నాడు కార్మికులను, పని మనుషులను చైతన్యం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ ప్రారంభించారు. బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో జరిగిన ప్రతినిధుల సభలో ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ… అన్ని వర్గాలకు ప్రజాకళాకారులు కీలకమన్నారు. గతంలో ఫ్యూడల్ వ్యవస్థ వల్ల మనిషి స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయారని, ఇప్ప్పుడు ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని, ప్రజల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. నాటి కళాకారుల చరిత్ర, త్యాగాలను తెలుసుకుని నేటి యువ కళాకారులు ధైర్యంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
మతోన్మాదుల ఆగడాలు తరిమికొట్టాలి: నరసింహ
ఇ.టి.నరసింహ ప్రారంభోపన్యాసం చేస్తూ మతోన్మాద శక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కళాకారులు అప్రమత్తంగా ఉండాలని, పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా కళా ప్రదర్శనలిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం ముఖ్యమన్నారు. ఎంఐఎం, బీజేపీ ఒక్కటేనన్నారు. హైదరాబాద్ పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం నేడు దేశవ్యాప్తంగా విస్తరించిందంటే ఎవరి వల్ల సాధ్యమైందో అర్థం చేసుకోవచ్చన్నారు. మతోన్మాదుల ఆగడాలను తరిమికొట్టేందుకు ప్రజాకళాకారులు తమ పాటలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సంపదను అదాని, అంబానీకి ప్రధాని మోదీ పంచిపెడుతున్నారని, అది దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమన్నారు. దేశంలో 96 శాతం మంది ప్రజలు మోదీ పాలనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎసఐఆర్) పేరుతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.చాయాదేవి, ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.స్వామి, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి పల్లె నరసింహ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కోశాధికారి పడాల నళిని, సహాయకార్యదర్శి కొండల్ రావు, కె.ఉప్పలయ్య, నాయకులు జగన్, ప్రజానాట్యమండలి (సీపీ¾ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ, సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి స్టాలిన్, కార్యవర్గ సభ్యులు నెర్లకంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


