Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రికెట్ బెట్టింగ్ ముఠాపై మెరుపు దాడి..

క్రికెట్ బెట్టింగ్ ముఠాపై మెరుపు దాడి..

- Advertisement -

రూ.13.20 లక్షల నగదు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

విశాలాంధ్ర – హిందూపురం..హిందూపురం మండలం తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో నిర్వహిస్తున్న అక్రమ క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖచ్చితమైన సమాచారంతో మెరుపు దాడి నిర్వహించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.13.20 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ మీడియాకు వెల్లడించారు. హిందూపురం రూరల్ యూపీఎస్ ఇన్స్పెక్టర్ చంద్ర అంజినేయులుకు అందిన ఖచ్చితమైన సమాచారం, సత్యసాయి జిల్లా నిఘా వర్గాల సమాచారంతో ఈనెల 5న ప్రత్యేక దాడి నిర్వహించినట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, జూద కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో హిందూపురం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు, మెరుపు దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ దాడిలో సందీప్ కుమార్ రెడ్డి, తిమ్మారెడ్డి, యర్రబల్లి శ్రీనివాసరెడ్డి అనే ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వారు ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టించడమే కాకుండా కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం, బైక్ రేసింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా, వాటికి సహకరించినా కేసులు నమోదు చేసి అరెస్టులు చేపడతామని తెలిపారు. పదేపదే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత సులభ డబ్బు ఆశకు లోనై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా హిందూపురం యూపీఎస్ ఇన్స్పెక్టర్ చంద్ర అంజినేయులు మరియు పోలీసు సిబ్బందిని అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ అభినందించి రివార్డులు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు