మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది ‘ విడుదలకు ముందే తెలంగాణలో ఊహించని అడ్డంకిని ఎదుర్కొంది. సినిమా మొదటి వారం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ ధరల పెంపునకు అనుమతి కోరుతూ చిత్ర బృందం మొదట హోం సెక్రటరీకి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, టికెట్ల ధరల విషయంలో ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. గతంలో ఉన్న పలు కేసులను, తీర్పులను ప్రస్తావిస్తూ తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.
సినిమా జూన్ 4న విడుదలవుతుండగా, విచారణ జూన్ 6న జరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన చిత్ర నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఆసక్తికరంగా ఏపీలో ‘పెద్ది్ణ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు లభించాయి. కానీ, తెలంగాణలో మాత్రం పాత ధరలకే సినిమాను ప్రదర్శించాల్సి రావడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


