Homeజనంలోకి వెళ్లండి

జనంలోకి వెళ్లండి

- Advertisement -

. అభివృద్ధి, శాఖల ప్రగతిని వివరించండి
. మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం
. అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారంపై జాప్యం దేనికి?
. అధికారులపై సీఎం ఆగ్రహం

విశాలాంధ్ర- సచివాలయం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో మంత్రులందరూ ప్రజాక్షేత్రంలోనే గడపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పునర్నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, పర్యాటక రంగం, సంక్షేమ పథకాల విస్తరణపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. “గత ప్రభుత్వ విధ్వంసకర నిర్వాకాలపై మనం అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాం. అప్పటి నుంచి ఈ రెండేళ్ల కాలంలో ఆయా శాఖల్లో మనం సాధించిన అభివృద్ధి, తెచ్చిన మార్పులను ఈనెల 28వ తేదీ లోపు శాఖల వారీగా ప్రజలకు సవివరంగా వివరించాలి” అని మంత్రులను సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్క మంత్రి తమ శాఖల ప్రగతిని పక్కా గణాంకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తి మద్దతు ఇస్తున్నా ఎందుకింత అలసత్వం?” అని అధికారులను గట్టిగా నిలదీశారు. బాధితులకు న్యాయం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటులో ఆలస్యాన్ని తప్పుపట్టిన సీఎం… కేసుల వేగవంతమైన పరిష్కారానికి తక్షణమే 31 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాలయాపన లేకుండా వెంటనే కేబినెట్ సబ్ కమిటీని రంగంలోకి దించాలని ఆదేశించారు. రైతాంగం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, దేశీయ స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ‘పంట మార్పిడి విధానాన్ని’ అవలంబించేలా వ్యవసాయ శాఖ తగిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ శాఖకు వివిధ విభాగాల్లో లభించిన ప్రతిష్టాత్మక అవార్డులను అధికారులు కేబినెట్ ముందు ప్రదర్శించారు. శాఖ సాధిం చిన ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రిమండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలుపుతూ… ఇదే స్ఫూర్తితో మిగిలిన శాఖలు కూడా నెంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. కేబినెట్ సమావేశం కొనసాగుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆయన ముఖ్యమంత్రికి, సహచర మంత్రులకు సమాచారం అందించి సమావేశం మధ్యలోనే నిష్క్రమించారు.
వైసీపీ గందరగోళ రాజకీయాన్ని తిప్పికొట్టాం
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 16 వేల టీచర్ పోస్టులను (డీఎస్సీ) అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ నిరుద్యోగులను, ప్రజలను అయోమయానికి గురిచేయాలని చూశారని మండిపడ్డారు. ప్రభుత్వం గట్టిగా కౌంటర్ ఇవ్వడంతోనే విపక్షం ఇప్పుడు తోక ముడిచిందని వ్యాఖ్యానించారు. మనం చేసిన మంచిని వివరంగా చెబితేనే ప్రజలకు అర్థమవుతుం దన్నారు.ఇటీవల రాజధానిలో కొంతమంది రైతులను జగన్ కలవడాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ గందరగోళంలోకి నెట్టాలని చూసినా అమరావతి రైతులు ఆయన మనస్తత్వాన్ని పూర్తిగా గ్రహించారని సీఎం అన్నారు. జగన్ తో భేటీ అయిన అశోక్ అనే రైతు కూడా నిన్న నేలపాడులో తన భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించారని మంత్రి నారాయణ ఈ సందర్భంగా కేబినెట్ దృష్టికి తెచ్చారు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తే విపక్షాల అబద్ధపు ప్రచారాలు సాగవన్నారు. అలాగే అమరావతి, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్దేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు