Homeఅంతర్జాతీయంసరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

- Advertisement -


నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్
న్యూదిల్లీ:
భారత్‌తో సరిహద్దు సమస్యను దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ అన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలూ పరస్పర గౌరవం, హేతుబద్ధమైన ఆలోచనలు, సానుకూల దృక్పథంతో చర్చలు జరిపితే ఏ సమస్య పరిష్కరించుకోలేంత క్లిష్టమైనది కాదన్నారు. గత అనుమానాలు, ఆందోళనలను పక్కన పెట్టి, ఇరు దేశాల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత్‌తో కలిసి పని చేయడానికి నేపాల్ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్-నేపాల్ సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా, బ్రిటన్‌ల సాయాన్ని కోరనున్నట్లు ఇటీవల నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ అభిప్రాయాన్ని నేపాల్ గౌరవిస్తున్నట్లు శిశిర్ ఖనాల్ స్పందనతో స్పష్టమైంది. తాము బ్రిటన్ మధ్యవర్తిత్వాన్ని కోరడం లేదని, కేవలం సరిహద్దుల నిర్ధారణకు సంబంధించిన చారిత్రక పత్రాలు, ఆధారాల కోసం అక్కడి గ్రంథాలయాలు, మ్యూజియంలను పరిశీలించాలని భావిస్తున్నట్లు శిశిర్ ఈ సందర్భంగా చెప్పారు. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలపై నెలకొన్న వివాదం గురించి ఆయన మాట్లాడుతూ… అవి తమ దేశానికి చెందిన ప్రాంతాలన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన శిశిర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో శనివారం సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు