ఎన్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి దిక్సూచి, నవకల్పనల నాయకుడని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం నూదిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో కృతజ్ఞతా తీర్మానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మోదీ నాయకత్వం, పరిపాలన, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రశంసించారు. భారతదేశంలో నిరంతరంగా ఎన్నికై అత్యంత కాలం ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని సభ ముందు ప్రవేశపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, దేశానికి అవసరమైన సరైన నాయకుడు ఆయన అని కొనియాడారు. నరేంద్ర మోదీ గారి గొప్ప బలం ఏమిటంటే, ఆయన మనకు దిక్సూచిగా ఉండటమే కాకుండా నవకల్పనలకు మార్గదర్శకుడిగా కూడా ఉన్నారు. ‘దేశమే మొదటి ప్రాధాన్యం’ అనే ఒక్క అజెండాతో ఆయన పనిచేస్తున్నారు. మనమంతా కూడా అదే సిద్ధాంతాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి” అని పేర్కొన్నారు. మోదీ దీర్ఘకాల ప్రజాసేవా ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ… “2001లో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దాదాపు 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటాను. ప్రజల అంచనాలకు ఆయన ఎలా నిరంతరం అనుగుణంగా నిలుస్తున్నారు? అదే ఆయన నాయకత్వానికి ప్రత్యేకత” అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి సర్వేలో ఆయన ప్రజాదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది దేశమంతటికీ గర్వకారణమన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకు, భారతదేశానికి గౌరవం లభిస్తోందన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మన లక్ష్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం నాకు ఉంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఇది భారతదేశానికి నిర్ణాయకమైన సమయం. ఇది స్వర్ణయుగానికి నాంది. ఆయన నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రజల పట్ల మా నిబద్ధత అచంచలమైనది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం కోసం మా సంకల్పం దృఢమైనది” అని చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోదీ పాలనా తీరును కొనియాడారు.


