Homeజాతీయంక్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు

క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు

- Advertisement -

దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.క్యాన్సర్ రోగులకు అత్యవసరంగా వినియోగించే కార్బోప్లాటిన్ ,సిస్‌ప్లాటిన్ మందుల గరిష్ఠ ధరలను 50శాతం మేర పెంచేందుకు భారత జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.
మార్కెట్లో ఈ మందుల కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ధరల పెంపునకు కారణాలివే..
ఈ మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్(API)ధరలు భారీగా పెరగడం,ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం,విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం వల్ల ధరలు పెంచాలని ఔషధతయారీ సంస్థలు ఎన్‌పీపీఏను కోరాయి. దీంతో ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులు-2013లోని ప్రత్యేక అధికారాలను వినియోగించి ధరల సవరణకు సంస్థ నిర్ణయం తీసుకుంది.

ప్రాణాలను కాపాడే మందులు అందుబాటులో ఉండాలి
ప్రాణాలను కాపాడే ఈ కీలక ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉండటమే తమ ప్రధాన ఉద్దేశమని ఎన్‌పీపీఏ స్పష్టం చేసింది. మందుల తయారీ సంస్థలకు గిట్టుబాటు కాకపోతే వాటి ఉత్పత్తి తగ్గిపోయి, రోగులు ఖరీదైన ప్రత్యామ్నాయ మందులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది.
అందుకే ధరల పెంపు ద్వారా సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని నిర్ణయించింది.

ఆరు నెలల తర్వాత సమీక్ష
కార్బోప్లాటిన్, సిస్‌ప్లాటిన్ మందులపై అమలు చేస్తున్న ఈ 50 శాతం ధరల పెంపును ఆరు నెలల తర్వాత లేదా అవసరమైతే అంతకంటే ముందే సమీక్షించనున్నట్లు ఎన్‌పీపీఏ తెలిపింది. API ధరల్లో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, యాంటీ టెటానస్ ఇమ్యునోగ్లోబులిన్ (250 IU, 500 IU) ఔషధాల ధరలను కూడా పెంచింది. మొత్తం 82 ఔషధాల ధరల సవరణకు దరఖాస్తులు రాగా, కేవలం నాలుగు మందులకే ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. మిగిలిన 78 దరఖాస్తులను అదనపు సమాచారం కోసం పెండింగ్‌లో ఉంచింది.

మందుల కొరతతో చికిత్సల్లో జాప్యం
క్యాన్సర్ చికిత్సలో మొదటి దశలో ఉపయోగించే ఈ కీమోథెరపీ మందుల కొరత కారణంగా చికిత్సలు ఆలస్యం కావడం, మందుల మోతాదులు తగ్గించడం, కీమోథెరపీ షెడ్యూళ్లు మధ్యలో నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆస్పత్రుల్లో నిల్వలపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆంకాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కొరత కారణంగా ప్రత్యామ్నాయ ప్లాటినం ఆధారిత చికిత్సలను ఉపయోగించాల్సి వస్తోంది. అయితే అవి తక్కువ ప్రభావవంతంగా ఉండటంతో పాటు రోగులు, ఆస్పత్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రాణాలను కాపాడే ఈ కీలక మందులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌పీపీఏ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు