రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుపై జరిగిన రాళ్ల దాడి జరిగింది.
ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.
గురువారం రాత్రి మోహన్ భాగవత్ కాన్పూర్ నుంచి దిల్లీకి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు.
ఈ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు.
ఈ దాడి కారణంగా ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లోని ఒక కిటికీ అద్దం ధ్వంసమైంది. మోహన్ భాగవత్ కూడా ఇదే కోచ్‌లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
మోహన్ భాగవత్‌కు ఎలాంటి గాయాలు కాలేదు
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ దాడిలో మోహన్ భాగవత్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే రైలుపై రాళ్లు విసిరినట్లు గుర్తించారు.
వారిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడి వెనుక ఉన్న కారణాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.


