Homeజిందాల్కు జీ హుజూర్!

జిందాల్కు జీ హుజూర్!

- Advertisement -
  • కార్పొరేట్లకు ఇనుప ఖనిజం
  • దోచిపెడుతున్న సహజ సంపద
  • విశాఖ ఉక్కుకు మొండిచేయి
  • ప్రభుత్వ చర్యలపై ఆందోళన
  • ప్రకృతి వనరుల అప్పగింతపై విమర్శల వెల్లువ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పబ్లిక్ ప్రైవేట్ పారట్నర్షిప్ (పీపీపీ)తో ప్రభుత్వ వైద్య కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం ఒడిగట్టి తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, భూములను, సహజ సంపదను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను కూ{మి ప్రభుత్వం అనుసరిస్తూ విమర్శలపాలవుతోంది. పరిశ్రమలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న పేరుతో విలువైన భూములను ఎకరా 99 పైసలకే కట్టబెట్టిన సంఘటనలు కళ్లముంగిట కదలాడుతున్నాయి. ప్రైవేట్ కంపెనీల వద్ద కమీషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రంలో ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారన్న ఆరోపణలూ హల్చల్ చేస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ఇనుప ఖనిజం కేటాయించాలన్న డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టి, ఏపీఎండీసీ-జిందాల్ సంయుక్త సంస్థకు ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజ గనుల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని జిందాల్ స్టీల్ కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. కొణిజేడు, మర్లపాడు, యంపర్ల తదితర గ్రామాల్లో దాదాపు 75 మిలియన్ మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నట్లు గతంలో నిర్వహించిన సర్వేలు పేర్కొంటున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ(కేఐఓసీఎల్) దాదాపుగా 25 ఏళ్ల క్రితమే సమగ్ర నివేదిక ఇచ్చింది. మరోవైపు 25 ఏళ్ల నుంచి ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజం గనులను విశాఖ ఉక్కు కర్మాగారం అప్పగించాలని దరఖాస్తు చేసినా, దానిని పాలకులు విస్మరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ గనులను జింపెక్స్‌ అనే కార్పొరేట్ కంపెనీకి పదేళ్ల క్రితం కేటాయించింది. గనుల కేటాయింపు జరిగినప్పటికీ… ఆ సంస్థ వాణిజ్య పరంగా ఖనిజ తవ్వకాలను ప్రారంభించలేకపోయింది. దాదాపు పదేళ్లకు పైగా గడిచినా ఒక్క టన్‌ను ఇనుప ఖనిజం కూడా వెలికితీయకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో రాష్ట్రంలోని విలువైన ఖనిజ సంపద వినియోగం లేకుండా నిలిచిపోయిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా మళ్లీ కార్పొరేట్‌కు చెందిన జిందాల్కు గనుల నిర్వహణ బాధ్యల్ని కేటాయించడంతో వార్తల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) భాగస్వామ్యంతో జిందాల్ గ్రూప్‌కు చెందిన ఉక్కు సంస్థతో సంయుక్త ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు అమలు కోసం ప్రత్యేక జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీఎండీసీ`జిందాల్ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రక్రియలో జిందాల్కు 89 శాతం, ఏపీఎండీసీకి 11శాతం ఈక్విటీ వాటాలు ఉన్నాయి. జిందాల్ స్టీల్ కంపెనీతో చేసిన ఒప్పందం రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా నష్టం చేకూర్చుతుంది. ఆ గనుల్లో కేవలం 11శాతమే రాష్ట్ర ప్రభుత్వానికి వాటాగా ఉంచుకుని, అధికంగా 89 శాతం వాటాలతో జిందాల్ స్టీల్ వేలకోట్ల లాభాలు ఆర్జించనుంది. కేవలం కమీషన్ల కోసమే ఈ తరహా చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇనుప ఖనిజం ధర ప్రస్తుత మార్కెట్‌లో నాణ్యత ఆధారంగా టన్‌ను రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతోంది. ఇంతటి విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీల పరం చేయడం ప్రజా వ్యతిరేక చర్యగా నిలుస్తుంది. ఈ ఇనుప ఖనిజ గనుల వినియోగం, వాటి ద్వారా రాష్ట్రానికి లభించే ఆదాయం, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు, విశాఖ ఉక్కు భవిష్యత్తుపై ప్రభావం అంశాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ గనుల అభివృద్ధి ఏ దిశలో సాగుతుందన్నది రాష్ట్ర ఖనిజ విధానానికి, పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు సమకూర్చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చలేదు. ప్రతి ఏటా విశాఖ ఉక్కు కర్మాగారానికి దాదాపు రూ.2వేల కోట్ల అదనపు వ్యయ భారం పడుతోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలని ప్లాంట్ యాజమాన్యం చాలా కాలంగా ప్రభుత్వాలను కోరుతోంది. సొంత గనులు లభిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గడంతో పాటు సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని కార్మిక సంఘాలు, ఉక్కు పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే లక్ష్యంతోనే…సొంత గనులు కేటాయించడం లేదనేదీ స్పష్టమవుతోంది. ప్రైవేట్ కంపెనీల నుంచి కమీషన్ల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే జిందాల్తో ఒప్పందాలను రద్దు చేయాలని, ఇవే గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వెంటనే కేటాయించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఖనిజ వనరులను అందించకుండా ప్రైవేట్ రంగ సంస్థకు కేటాయించడం సరికాదని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాజా బ్లాక్‌ను వేదాంత కార్పొరేట్ కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపైనా పెద్దఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. కృష్ణాజిల్లాలోని మొవ్వ, గూడూరు, మచిలీపట్నం, పామర్రు పరిసర ప్రాంతాల్లో ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసి కనుగొన్న తర్వాత 114.93 చదరపు కిలో మీటర్ల పరిధిలోన్‌ను చమురు సహజ వాయువు కాజ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించకుండా…ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలా అనుమతులిస్తూ, విలువైన రాష్ట్ర సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడమే. 12వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల మేరకు కేజీ బేసిన్‌లో ఉత్పత్తయ్యే గ్యాస్‌లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీఎస్ఆర్టీసీని విద్యుత్ బస్సుల కొనుగోలు ముసుగులో ప్రైవేటీకరణ ఆలోచనలకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమ కార్యాచరణకు దిగింది. కేవలం దిల్లీకి కూటమి నేతలు వెళ్లినప్పుడు అప్పలకు నిధుల సేకరణ, లేకపోతే అమరావతి రాజధాని పనులపైనే దృష్టి పెడుతున్నారేగానీ, రాష్ట్ర సహజ వనరుల సంపద మనకు దక్కేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పీపీపీతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ విధానాల్ని చంద్రబాబు ప్రభుత్వం విడనాడి, రాష్ట్ర సహజ సంపదను వరుస వారీగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధానాల్ని విరమించకపోతే… ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం కానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు