Homeఆంధ్రప్రదేశ్సాయికృష్ణ కేసు… సీఐ నాగరాజుకు సహకరించిన మరో ముగ్గురిపై సిట్ ఫోకస్!

సాయికృష్ణ కేసు… సీఐ నాగరాజుకు సహకరించిన మరో ముగ్గురిపై సిట్ ఫోకస్!

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గెడ్డం సాయికృష్ణ (25) కస్టడీ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగార్జునకు మరో ముగ్గురు సహకరించినట్లు సిట్ గుర్తించింది. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానితో పాటు సీఐ స్నేహితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డుల (సీడీఆర్) విశ్లేషణ ద్వారా వీరి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కేసు వివరాల్లోకి వెళితే.. రౌడీ షీటర్‌ సాయికృష్ణను మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకుని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతడిని అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించడంతో మే 6 నుంచి 8వ తేదీల మధ్య కస్టడీలోనే మృతి చెందినట్లు సిట్ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది. అనంతరం సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశంతో మృతదేహాన్ని మాయం చేశారని, అది ఇప్పటికీ లభ్యం కాలేదని తెలిపింది. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ డీవీఆర్‌లో ఎలాంటి ఫుటేజ్ లభ్యం కాలేదని ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైంది.

మాజీ సీఐ నాగార్జున అరెస్ట్ అనంతరం హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, అలాగే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. నిందితులు మే 29న వడ్డేశ్వరంలో సాయికృష్ణ బంధువులను కలిసినట్లు కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సిట్ నిర్ధారించింది. ఈ కేసులో మరికొందరు పోలీసు సిబ్బంది పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.

సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవడంతో, ఈ కేసు విచారణకు ఐజీపీ రవిప్రకాశ్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసుపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. సిట్ నివేదికను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు