Homeఅంతర్జాతీయంషోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో.. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో.. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి

- Advertisement -

పాకిస్థాన్ మళ్లీ తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత వ్యతిరేక శక్తులకు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు ఆ దేశం సురక్షితమైన ప్రాంతం అనడానికి నిదర్శనంగా మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు భారత్‌లో ఘోర ఉగ్రదాడులకు పాల్పడిన నిషేధిత లష్కరే తయ్యిబా అగ్రనేతలు, కమాండర్లు బహిరంగంగా హాజరవడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ కూడా అక్కడ కనిపించడం.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతడంతో.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇస్లామాబాద్‌లో పహల్గాం దాడి సూత్రధారి హల్‌చల్
ఇస్లామాబాద్‌లో జరిగిన షాహిద్ అక్తర్ అంత్యక్రియల్లో.. గతేడాది భారతదేశంలోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి, లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ అలియాస్ ఖలీద్ అందరి ముందూ బాహాటంగా తిరుగుతూ కనిపించాడు. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన ఘోర దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక ఈ ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరీనే కీలక పాత్ర పోషించాడు. దాడి అనంతరం భారత్‌కు వ్యతిరేకంగా ఇతడు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇంతటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రాజధాని నగరంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరగడం గమనార్హం.

హఫీజ్ సయీద్ రాజకీయ ముఠా కూడా హాజరు..
ఈ అంత్యక్రియలకు సైఫుల్లా కసూరీతో పాటు ఐరాస నిషేధిత ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చెందిన పొలిటికల్ వింగ్ ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పీఎమ్ఎమ్ఎల్) అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహ్మాన్ కూడా హాజరయ్యాడు. లష్కరే తోయిబాపైపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి హఫీజ్ సయీద్ ఈ పీఎంఎంఎల్ అనే రాజకీయ విభాగాన్ని తెరపైకి తెచ్చాడు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఉగ్రవాద అనుబంధ సంస్థ గత 2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అధికారికంగా పోటీ చేసింది.

ఈ పరిణామం ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పుతూ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తోందో మరోసారి స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఒత్తిడి ఉన్నా, తమ దేశంలో ఉగ్రవాదులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారనే భారత్ ఆరోపణలకు ఈ అంత్యక్రియల వీడియోలు పక్కా సాక్ష్యాలుగా నిలిచాయి. అంతేకాకుండా పాక్‌లోని ప్రముఖులు, మాజీ సెలబ్రిటీలపై ఈ ఉగ్రవాద సంస్థల ప్రభావం ఎంతలా ఉందో ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ప్రస్తుతం ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోయబ్ అక్తర్ కుటుంబ కార్యక్రమానికి ఉగ్రవాదులు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు