1949 ఆగస్టు 15, జెండా పండగకు ముస్తాబైన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం! అక్కడకు వచ్చిన ప్రొఫెసర్ తూమాటి దోణప్ప అక్కడ సాదాసీదా దుస్తుల్లో నిలబడి ఉన్న ఓ మనిషిని చూసి,’ బహుశా సర్వోదయ నాయకుడై ఉంటాడు!’ అనుకున్నారట. అయితే, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని ఆయనే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ అని తెలుసుకొని, ఆశ్చర్యలో మునిగిపోయారట!
అంత నిరాడంబరంగా జీవించిన మహారాజా విక్రమ దేవ్ వర్మ 1869 జూన్ 28వ తేదీన, కృష్ణచంద్రదేవ్ వర్మ, రేఖా దేవి దంపతులకు శ్రీముఖలింగ క్షేత్ర సమీప గ్రామమైన నగరికటకంలో జన్మించారు. నగరికటకం సమీపంలోని పర్వతాల పేటలో ఉండే గిడుగు వెంకట రామమూర్తి సావాసం వర్మకు బాల్యంలోనే లభించింది. వర్మ కంటే గిడుగు వారు ఐదేళ్లు పెద్దవారు. అయినా ఇద్దరు కలిసి వీధి భాగవతాలు, తోలుబొమ్మలాటలు చూసేవారు. సాహితీ అంశాలు చర్చించుకునేవారు. పెద్దయ్యాక ఇద్దరి దారులు వేరయ్యాయి. వర్మ గ్రాంథికాన్ని అమితంగా ఇష్టపడితే, గిడుగు వారు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని బుజానికి ఎత్తుకున్నారు. అయినా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతో గౌరవభావం ఉండేది.
మాడుగుల జమీందారు, వడ్డాది కృష్ణ భూపతి 1875లో మరణించారు. ఆయన భార్య సీతా పట్టమహాదేవి ఏడేళ్ల వర్మను దత్తత తీసుకున్నారు. కానీ ఆయనకు 12 ఏళ్ల వయసు వచ్చేనాటికి వివిధ కారణాలవల్ల ఆ దత్తత చెల్లలేదు! అయినా చాలాకాలం వర్మ మాడుగుల్లోనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో తన తొమ్మిదో ఏట తల్లిని, పదహారో ఏట తండ్రిని కోల్పోయారు.
మాడుగులలో ఉన్నప్పుడే వర్మ సారస్వత సాధన పుంజుకుంది. దివంగత కృష్ణ భూపతి కళారాధకులు. సాహిత్య అభిమాని. అందువలన మాడుగుల సంస్థానంలో శిష్టు కృష్ణమూర్తి, ఆడిదం బాల భాస్కర కవి, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి, మంత్రి ప్రగడ సూర్య ప్రకాశకవి, ఇంద్రగంటి గోపాల శాస్త్రి వంటి ఉద్దండ పండితులు ఉండేవారు. వారి సాన్నిహిత్యంలో వర్మకు తెలుగు సంస్కృత రచనల పట్ల ఆసక్తి పెరిగింది. 1900 లో వర్మ విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు.
జయపురంలో వర్మ చివరి దాయాది రాజా రామచంద్ర దేవ్ హఠాన్మరణంతో, జూన్ 1931లో ఆ సంస్థానం 24వ పాలకునిగా విక్రమ్ దేవ్ వర్మ అధికారం చేపట్టారు. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలకు ఆ సంస్థానం నిలయమైంది. విశాఖపట్నంలో వర్మ వందలాదిమంది మిత్రులతో సాహితీ గోష్ఠులు నిర్వహిస్తూ ఉండేవారు. సాగర తీరంలోని సంస్థానం విడిది గృహం, ‘హవా మహల్ ‘వీటికి కేంద్రంగా ఉండేది!
వీరు స్వయంగా ‘శ్రీనివాస కళ్యాణం’ అనే నాటకాన్ని, ‘మానవతి చరిత్ర’ అనే కావ్యాన్ని రచించారు. మంత్రి ప్రగడ సూర్యప్రకాశకవి రచించిన కావ్యానికి ‘కృష్ణార్జున చరిత్ర టీకా’ అనే వ్యాఖ్యానం రాశారు. ఉత్కళ భాషలో ‘రాధా మాధవ నాటకం’ రచించారు.
ముసలి మగడు, పయనపు చెలికాడు అనే కథలు రాసి ‘ఆంధ్రి’ పత్రికలో ప్రకటించారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి మేఘదూత కావ్యము, కొక్కొండ వెంకటరత్నం సింహాచల యాత్ర కావ్యము, బులుసు పాపయ్య శాస్త్రి రచించిన అలంకార సంగ్రహము, ప్రసాదరాయ కవి రచించిన మొయలు రాయబారము మొదలైన కృతులు వీరికి అంకితం చేశారు. సంస్కృతము, ఒరియా, తెలుగు భాషలతో పాటు హిందీతో కూడా వీరికి పరిచయం ఉంది. తులసీదాసు విరచిత ‘వరü బుTతు వర’నము’ కావ్యాన్ని, తెలుగు పద్య రూపంలో వర్మ గారు అనువదించారు.
“రాజు నిజ దేశమునకును ప్రజలకు దొర
ననుచు దలపక తన్ను శ్రీహరిజనులకు
సేవ చేయుట కొరకే సృజించెనంచు
నెంచి విర్రవీగక సంచరించు టొప్పు”
“ప్రజలు శ్రమపడి అర్జించి భక్తి తనకు
నిచ్చిన ధనంబు వారికై వెచ్చపెట్ట
కాత్మ భోగాళి కొరకును ఖ్యాతి కొరకు
వమ్ము సయుట తగునె పాలకులకు”
అంటూ రాజధర్మం గురించి వీరు రాసిన పద్యాలు చదివితే, వీరు ఎంతటి ధర్మ ప్రభువులో మనకు అర్థమవుతుంది.
విశాఖపట్నంలో నాటక రంగం వేళ్లూనడానికి ప్రధాన కారకులలో వర్మ ఒకరు. 1919లో విశాఖపట్నంలో నిర్వహించిన మొదటి ఆంధ్ర నాటక పరిషత్‌కు ఆయనే అధ్యక్షులు. మారేపల్లి రామచంద్ర శాస్త్రి కార్యదర్శి. విశాఖపట్నంలో నడిచిన ‘జగన్మిత్ర నాటక మండలి’ ఎన్నో తెలుగు నాటకాలకు వేదిక అయింది. ఒడియా సమాజ్ ఆధ్వర్యంలో ఆ భాషా నాటకాల ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉండేవి.
విద్యారంగానికి కూడా వర్మ చిరస్మరణీయ సేవలు అందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆయనది విడదీయరాని అనుబంధం. తొలి రోజుల్లో అంటే 1926 -1930 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షిక బడ్జెట్ లక్ష లోపు మాత్రమే ఉండేది! 1930 నుంచి ఖర్చులు బాగా పెరిగాయి! దాంతో వర్మ ఏటా లక్ష రూపాయల విరాళం ఇవ్వడం ప్రారంభించారు. ఇలా దాదాపు 20 ఏళ్లు ఆ సాయం చేశారు. ‘ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ’ కళాశాల భవన నిర్మాణం వర్మ ప్రోత్సాహంతోనే జరిగింది. దానికి కృతజ్ఞతగా, ఆ కళాశాలకు ఆయన పేరు పెట్టడమే కాదు, ఆ ప్రాంగణంలో ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.
1937- 1951 మధ్య విశ్వవిద్యాలయానికి వర్మ “ప్రో చాన్సలర్‌గా” వ్యవహరించారు. అదే సమయంలో విద్యావేత్త డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఉపకులపతిగా పనిచేశారు. వారిద్దరి కాలాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయ చరిత్రలో స్వర’ యుగంగా చెప్పుకుంటారు. విద్య, కళారంగాలకు వర్మ చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర’ బిరుదును: ఉత్కళ ఆంధ్ర సంస్కృత విశ్వవిద్యాలయాలు వీరికి ‘డి లిట్’ పట్టాను ప్రదానం చేశాయి.
ఇలా తెలుగు ఒడియా ప్రాంతాలకు దీపస్తంభంలా నిలిచిన వర్మ, చివరి రోజుల్లో అస్వస్థతతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, 1951 ఏప్రిల్ 14న, జయపురంలో స్వర్గస్తులయ్యారు.
తెలుగు-ఒడియా ప్రాంతాల దీపస్థంభం
- Advertisement -


