Homeదేశం గర్వించేలా అమరావతి

దేశం గర్వించేలా అమరావతి

- Advertisement -
  • నిర్మాణ పనుల్లో వేగం పెరగాలి
  • నిర్దేశిత గడువులోపే పూర్తి కావాలి
  • నిర్మాణ సంస్థలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచి నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. యావత్ దేశం గర్వించే విధంగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన అమరావతి నగర నిర్మాణంలో భాగస్వాములైన కాంట్రాక్ట్ సంస్థలన్నీ గర్వపడాలన్నారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించామని అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకమూ లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తున్నామని మంత్రి తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం… భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరంతా ముందుకు వెళ్లాలని సీఎం కోరారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని పేర్కొన్నారు. అమరావతికి పేరు తెచ్చేలా ఈ భవనాలను నిర్మించాలన్నారు. రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని సీఎం వెల్లడిం చారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ సహా వేర్వేరు కాంట్రాక్ట్ సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ అధికారులు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
వాట్సాప్ ఫిర్యాదులకూ అవకాశం
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు సీఎం మార్గనిర్దేశనం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని సూచించారు. అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు… మనమిత్ర వాట్సాప్‌లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజ్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సుమారు 3 వేల ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులను వెంటపెట్టుకుని చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చారు. ఆర్టీజీఎస్ పనితీరును ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ సీఐఐ ప్రతినిధులకు వివరించారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలను పరిపాలనలో ఏ విధంగా వినియోగిస్తున్నామనే అంశాన్ని భాస్కర్ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్టీజీఎస్ పనివిధానానికి సంబంధించిన కేస్స్టడీస్‌ను సీఐఐ ప్రతినిధులకు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు