Homeఅంతర్జాతీయంపీఓకేలో చెలరేగుతున్న ఆందోళనలు

పీఓకేలో చెలరేగుతున్న ఆందోళనలు

- Advertisement -

ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తే ఇతర మార్గాలు అన్వేషిస్తాం: జేఏఏసీ
రావల్‌కోట్:
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందనే వాదన ఉంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. వారిని దారిలోకి తెచ్చుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసర సరకులతో వస్తున్న ట్రక్కులు పీఓకేలోకి రానీయకుండా ఇటీవల అడ్డుకుంది. దీంతో ప్రధాన రహదారులపైనే అనేక ట్రక్కులు నిలిచిపోయాయి. గోధుమపిండి, బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాల కొరత ఏర్పడింది. ఆందోళనల గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు కొన్ని రోజులుగా అక్కడ ఇంటర్నెట్ సేవలపైనా పాక్ ఆంక్షలు విధించింది. ఆకలితో అలమటిస్తున్నప్పటికీ పాక్ ప్రభుత్వం ఆంక్షలు సడలించకపోవడంతో పీఓకే ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత 20 రోజులకు పైగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. పాక్ పాలకుల నియంతృత్వ ధోరణిలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. నియంత్రణ రేఖ సమీపంలో రావల్‌కోట్‌లో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో మంగళవారం భారీ ఎత్తున నిరసనకారులు పాల్గొన్నారు. సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ (జేఏఏసీ) నేతలు ప్రసంగిస్తూ…పీఓకే అసలు పాక్‌లో భాగం కాదని తేల్చి చెప్పారు. తమ ప్రజలకు పాకిస్థాన్ అవసరమే లేదని, పాక్‌కే తమ అవసరం ఉందన్నారు. ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ‘ఇతర మార్గాలను’ (భారత్‌తో సన్నిహిత సంబంధాలు) వెతుక్కోవాల్సి ఉంటుందని జాక్ నేతలు హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తీరునూ ఎండగట్టారు. నియంతలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జాక్ నేతల ప్రసంగాలకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు