ఎమ్మెల్యే ఫిర్యాదుతో వెలుగు చూసిన వైనం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల…సిద్ధంగా ఉండండి ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని తన పార్టీ వర్గాలకు పిలుపు ఇవ్వడం తాజా పరిణామాలకు మరింత ఊతమిస్తున్నట్లు కనపిస్తోంది. కాగా, టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు తమిళనాడు నిఘా విభాగం వెల్లడించింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15మంది టీవీకే ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామా చేయించేలా డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ పథకం రచించారని పేర్కొంది. ఈ వ్యవహారంలో సెంథిల్ బాలాజీ సోదరుడు వి. అశోక్ కుమార్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కుట్రపై దర్యాప్తు చేపట్టారు.
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముగ్గురు వ్యక్తులు కుట్ర పన్నారని టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీవీకే నేత తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ (ఐపీడీఎస్) కన్సల్టెన్సీకి చెందిన తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను కోరారని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకుగానూ రూ.35 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. అయితే, ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానని, ఇకపై తనను సంప్రదించవద్దని అతడికి చెప్పినట్లు తెలిపారు. కాగా, తమ మధ్య జరిగిన సంభాషణను బయటపెడతానని తిరునావుక్కరసు బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించానని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా అధికారుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. డీఎంకే నేత సెంథిల్ బాలాజీ సూచన మేరకే తిరునావుక్కరసు…ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించారని పేర్కొన్నారు.
టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
- Advertisement -


