లంచాలు తీసుకుని కొలువులు…దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు
అయోధ్య (లక్నో): అయోధ్య రామమందిరం వ్యవహారంలో తీగలాగితే డొంక తగిలినట్లు…విచారించే కొద్దీ మరికొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. విరాళాల చోరీ కేసును తవ్వేకొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న అధికారుల బృందం మరో అక్రమాన్ని గుర్తించింది. ఆలయంలో వివిధ పోస్టులకు లంచాలు తీసుకుని నియామకాలు చేశారని నిందితుడు వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. విచారణ పూర్తయ్యే లోపల మరెన్ని అక్రమాలు బయటపడతాయనే చర్చ మొదలైంది. ఇప్పుడు ట్రస్ట్ సభ్యుల్లో కీలకమైన వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా వయో భారంతో పాటు విరాళాల చోరీ వ్యవహారం తలనొప్పితో ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ ఇప్పటికే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చోరీ వ్యవహారంలో ఇద్దరు ట్రస్ట్ సభ్యులు ఇదివరకే రాజీనామా చేశారు. తాజా వ్యవహారం ట్రస్ట్‌కు మరింత తలనొప్పిగా తాయారైంది.
ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ ఉద్యోగాల్లో నియమించారు. వీరిలో కొందరి వద్ద నుంచి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆలయంలో ఉద్యోగుల నియామక లెటర్లు, సర్వీస్ అగ్రిమెంట్లు వంటి పత్రాలు ఏవీ పోలీసుల చేతికి అందలేదు. దీంతో ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయో గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, వారి లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అనుకల్ప్ మిశ్రా, లవ్ కుశ్ మిశ్రాకు ఈ నియామకాల అవకతవకల్లో కీలక పాత్ర ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
రామమందిరం ఉద్యోగ నియామకాల్లోనూ అక్రమాలే!
- Advertisement -
RELATED ARTICLES


