విరాళాల చోరీ వ్యవహారంలో తనకు ద్రోహం జరిగిందని ఆవేదన
అయోధ్య: రామాలయ విరాళాల చోరీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు మాజీ అధినేత చంపత్ రాయ్ ట్రస్టులో కొనసాగలేన్నట్లు తెలిసింది. రామజన్మభూమి ఆలయానికి తన సేవలు ఇక పూర్తైనట్టేనని, ఆలయ విరాళాల స్వాహాకు సంబంధించి తనపై మచ్చ పడిన నేపథ్యంలో ఇంకా కొనసాగలేనని చంపత్రాయ్ తన సహచరులతో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తనకు ద్రోహం జరిగిందని చంపత్రాయ్ సహచరుల సమక్షంలో వాపోయారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తనకు జరిగిన ద్రోహమేమిటో ఆయన విశదీకరించలేదు. దీనిపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. దీని వెనుక పెద్ద వ్యహారం సాగిందని, పెద్ద తలకాయలు ఉన్నారనే పుకార్లకు ఈ వ్యాఖ్యలు మరింత ఊతం ఇచ్చినట్లవుతుంది. రామాలయ ట్రస్టులో ఇంతకాలం తాము నిర్వహించిన పదవులకు రాజీనామా చేసిన చంపత్రాయ్, అనిల్ మిశ్రల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ఈనెల 6న ట్రస్టు సమావేశం కానుంది. మరోవైపు విరాళాల స్వాహా కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చంపత్రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా, ఆలయ కీలక ఉద్యోగి గోపాల్రావును గురువారం విచారించింది. సిట్ ముగ్గురినీ వేర్వేరుగా ప్రశ్నించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా…మరోవైపు రామజన్మభూమి ఆలయానికి పక్కనే ఉన్న శతాబ్దాలనాటి రామ్ నివాస్ దేవాలయ ప్రముఖుడొకరు చంపత్రాయ్పై తీవ్ర ఆరోపణ చేశారు. ‘చంపత్రాయ్, ఆయన ముఠా’ రామ్ నివాస్ ఆలయాన్ని నకిలీ పత్రాల సాయంతో కాజేశారని ఆలయ పంచ్ ప్రముఖ్ హరిశంకర్ సఫారీవాలా మీడియా ముఖంగా ఆరోపించారు.
రామాలయ ట్రస్టులో ఇక కొనసాగలేను: చంపత్ రాయ్
- Advertisement -
RELATED ARTICLES


