యూరప్ వ్యాప్తంగా జూన్ మాసాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. అత్యధిక వేడిమి కారణంగా ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో కలిపి కనీసం 3,700 మందికి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. అయితే ఇవి ప్రాథమిక గణాంకాలేనని మరణాల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం యూరప్ చరిత్రలో ఈ ఏడాది జూన్ 20 నుంచి 28 వరకు నమోదైనవే అత్యధిక ఉష్ణోగ్రతలు అని తెలుస్తోంది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రహదారులు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఆస్పత్రులు, ఆరోగ్య సేవలు స్తంభించాయి. ఈ అసాధారణ వేడికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే అన్నారు. ఈ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్‌లో 2,025 అదనపు మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా వేడి కారణంగా మృత్యువాత పడిన వారిలో 45 ఏళ్లు దాటిన వారే ఎక్కువగా ఉన్నారని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి స్టెఫనీ రిస్ట్ వివరించారు. జూన్ 22 కు ముందు వారంతో పోలిస్తే 91 శాతం మరణాలు పెరిగాయన్నారు. అంతేకాదు వృద్ధాశ్రమాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో కూడా మరణాల సంఖ్య పెరిగిందన్నారు. గణాంకాల కంటే తుది మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇక బెల్జియంలో జూన్ 18 నుంచి 29 వరకు సుమారు 1,200 అదనపు మరణాలు నమోదయ్యాయి. వీరిలో 85 ఏళ్లు పైబడినవారు 530 మంది ఉన్నారు. అలాగే 65 ఏళ్లలోపు వారు 180 మంది ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఉష్ణోగ్రతల కారంగా ఇంత భారీ స్థాయిలో అదనపు మరణాలు సంభవించడం తమ దేశ చరిత్రలో ఇదే తొలిసారని బెల్జియం ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నెదర్లాండ్స్‌లో కూడా ఈ సుమారు 480 అదనపు మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉన్నారు.


