2008లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు గతంలో విధించిన 38 మంది దోషులకు మరణశిక్షను సమర్థించింది. మరో 11 మందికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ఈ పేలుళ్లలో 56 మంది ప్రాణాలు కోల్పోగా.. 246 మంది గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం 2027 మార్చి 31లోపు చెల్లించాలని ఆదేశించింది. 2008 జులై 26న అహ్మదాబాద్‌లో పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. రెండు రోజుల తర్వాత సూరత్‌లో పేలని బాంబులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలపై నమోదైన 35 కేసులను కలిపి ఒకే విచారణగా చేపట్టారు.
దర్యాప్తులో వంద మందికిపైగా నిందితులను గుర్తించగా, 78 మందిపై విచారణ జరిగింది. 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాజీ నాయకుడు సఫ్దర్ నాగోరి కూడా దోషుల్లో ఒకడు. సిమికి చెందిన కొందరు సభ్యులు కలిసి ఇండియన్ ముజాహిదీన్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసి ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసులు ఆరోపించారు. హత్య, హత్యాయత్నం, దేశంపై యుద్ధానికి యత్నం, దేశద్రోహం, ఉగ్రవాద కార్యకలాపాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, పేలుడు పదార్థాల చట్టం తదితర కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు.
ఈ కేసు విచారణ దాదాపు పదేళ్లకు పైగా సాగింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల ఎదుట 1,163 మంది సాక్షులను విచారించారు. వీరిలో 26 మంది కీలక సాక్షుల వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచారు. పేలుళ్ల తర్వాత పంపిన ఈ-మెయిళ్లలో 2002 గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు పేర్కొన్న విషయం కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది.


