శాఖమూరు పార్కులో రూ.17.58 కోట్లతో కృత్రిమ రెయిన్
దట్టమైన అడవి.. చిరుజల్లులతో నిండిన వాతావరణం.. కృత్రిమ జలపాతాల సవ్వడి.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతి మధ్య కాలినడకన సేదతీరే అవకాశం.. ఇవన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజధాని అమరావతిలో అభివృద్ధి చేస్తున్న శాఖమూరు పార్కులో ప్రత్యేకంగా ఐదెకరాల విస్తీర్ణంలో ఃమినీ అమెజాన్ః పేరుతో కృత్రిమ రెయిన్ ఫారెస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.17.58 కోట్ల అంచనా వ్యయంతో ఏడీసీ టెండర్లను ఆహ్వానించింది.
20 వేలకుపైగా చెట్లు.. 400 రకాల మొక్కలు
ఈ రెయిన్ ఫారెస్ట్‌లో 20 వేలకుపైగా చెట్లు, మొక్కలను నాటనున్నారు. సుమారు 400 రకాల వృక్షజాతులను పెంచేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో అంతరించిపోతున్న మొక్కల జాతులతో పాటు స్థానికంగా పెరిగే నేటివ్ స్పీసీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ప్రకృతి సమతుల్యతను కాపాడే విధంగా వివిధ రకాల వృక్షాలను ఎంపిక చేయనున్నారు.
మియావాకీ విధానంలో దట్టమైన అటవీ అభివృద్ధి
రెయిన్ ఫారెస్ట్‌ను మియావాకీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.ఎత్తుగా పెరిగే భారీ వృక్షాల నుంచి నేలకు ఆనుకుని పెరిగే చిన్న పొదల వరకు మొత్తం ఏడు స్థాయిల్లో మొక్కలను పెంచుతారు.దీంతో తక్కువ విస్తీర్ణంలోనే సహజ అడవిని తలపించేలా దట్టమైన అటవీ వాతావరణం ఏర్పడుతుంది.
జీవవైవిధ్య పరిరక్షణకు ప్రత్యేక కేంద్రం
ఈ ప్రాజెక్టును కేవలం సందర్శకుల వినోదానికే కాకుండా జీవవైవిధ్య పరిరక్షణకు అనువైన కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి చిన్న వన్యప్రాణులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించనున్నారు. ప్రకృతి వ్యవస్థను ప్రతిబింబించేలా అడవిలో చిన్న తటాకాలు, సెలయేళ్లు కూడా నిర్మించనున్నారు.
కృత్రిమ కొండలు, జలపాతాలు.. ప్రత్యేక నడక మార్గాలు
సందర్శకులకు సహజ అడవిలో విహరిస్తున్న అనుభూతి కలిగేలా కృత్రిమ కొండలు, వాటి నుంచి జాలువారే జలపాతాలను ఏర్పాటు చేస్తారు. సెలయేళ్లపై చిన్న బ్రిడ్జిలను నిర్మించి, ప్రత్యేక కాలిబాటలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్గాల్లో నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారు.
మొక్కల వివరాలు తెలుసుకునే సదుపాయం
అడవిలోని ప్రతి ప్రధాన వృక్షజాతి గురించి సందర్శకులు తెలుసుకునేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యార్థులు, పరిశోధకులకు ఇది ఒక ప్రకృతి విజ్ఞాన కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఇదే ప్రాంగణంలో అటవీ సంరక్షణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై అవగాహన కల్పించే చిన్న శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
రెయిన్‌గన్స్‌తో చిరుజల్లుల అనుభూతి
ఈ రెయిన్ ఫారెస్ట్‌లో మిస్ట్ గార్డెన్, రెయిన్ వాక్‌వే వంటి ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో ఉంటాయి.రెయిన్‌గన్స్ సాయంతో నిరంతరం చినుకులు కురుస్తున్నట్లుగా, పొగమంచు వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. దీంతో బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే అడవిలో 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని ఏడీసీ అధికారులు చెబుతున్నారు.
సందర్శకుల కోసం కెఫే
ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడిపేందుకు వచ్చే సందర్శకుల కోసం అడవి ప్రాంగణంలోనే ఒక కెఫేను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


