పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్న వేళ దేశంలో ఇంధన వినియోగ సామర్థ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పూణే గ్యాస్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు సంస్థ ప్రతిపాదనలు పంపింది. దేశంలో తొలిసారిగా ఎల్‌పీజీ వినియోగ సామర్థ్యానికి ప్రత్యేక విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. సరఫరా ఇబ్బందుల కారణంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర సుమారు రూ.3,100కు చేరిందని సంస్థ గుర్తు చేసింది. ఏడాది ఆరంభంలో ఇది రూ.1,884 వద్ద ఉండేదని పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, లాండ్రీలు, ఎంఎస్‌ఎంఈలు, తయారీ రంగ సంస్థలపై అదనపు భారం పడుతోందని వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ఎల్‌పీజీని మరింత సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఇప్పటి వరకు ప్రభుత్వం ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకుందని పూణే గ్యాస్ పేర్కొంది. ఇకపై వృథాను తగ్గించడం, వినియోగంలో ప్రమాణాలు తీసుకురావడం, సమర్థమైన ఎల్‌పీజీ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం కూడా ఇంధన భద్రతలో భాగం కావాలని సూచించింది. ఈ లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగంపై అవగాహన కల్పించాలని పేర్కొంది. ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పరిశ్రమలు కలిసి పనిచేసే విధంగా విధానం రూపొందించాలని ప్రతిపాదించింది.
పరిశ్రమల్లో సాధ్యమైన చోట 47.5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని కూడా సంస్థ సూచించింది. దీనివల్ల ఎల్‌పీజీ వృథా తగ్గడంతో పాటు భద్రత పెరుగుతుందని, అక్రమ మళ్లింపులను అరికట్టవచ్చని తెలిపింది. పూణే గ్యాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ జెసల్ సంపత్ మాట్లాడుతూ ఎల్‌పీజీ సరఫరా పెంచడం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. అందుబాటులో ఉన్న ఇంధనాన్ని సమర్థంగా వినియోగించడం కూడా దేశ ఇంధన భద్రతకు కీలకమని చెప్పారు. ఈ దిశగా కేంద్రం ప్రత్యేక విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.


