Homeజాతీయంమళ్లీ క్షిపణుల మోత

మళ్లీ క్షిపణుల మోత

- Advertisement -

తెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. హోర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి జరపడంతో నౌకకు మంటలు అంటుకోవడంతో పాటు ఒక సిబ్బంది అదృశ్యమైన ఘటనకు ప్రతిస్పందనగా సోమవారం ఉదయం ఇరాన్‌లోని అనేక లక్ష్యాలపై అమెరికా వరుస వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో యుద్ధ విరమణకు ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందం మరింత సంక్షోభంలో పడింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలో అమెరికా దళాలకు అశ్రయమిస్తున్న అనేక దేశాలపై క్షిపణి దాడులకు దిగింది.బహ్రెయిన్‌లో అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ స్థావరం లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది. కాగా, సోమవారం తెల్లవారుజామున దేశంలోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మృతి చెందినట్లు తెలిపింది. ఆదివారం ఇరాన్ చేపట్టిన దాడులు బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్తో పాటు ఒమన్ వరకు విస్తరించాయి. ఇరాన్‌తో కలిసి హోర్మూజ్ జలసంధి జలాలను పంచుకునే ఒమన్ కూడా ఈ ఉద్రిక్తతల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.
ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో ఒకప్పుడు ఐదో వంతు వాటా కలిగిన హోర్మూజ్ జలసంధి ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందానికి ప్రధాన సవాలుగా మారింది. యుద్ధానికి శాశ్వత ముగింపు దిశగా చర్చలు జరపాలనే ఉద్దేశంతో కుదిరిన 60 రోజుల ఒప్పందంలో ఇరు దేశాలు దాదాపు సగం కాలాన్ని పూర్తి చేసినప్పటికీ చర్చలు సాగక పోగా… పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ నాయకుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఇరాన్ యుద్ధం మళ్లీ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. “పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమైతే దాని పరిణామాలు అత్యంత వినాశకరంగా ఉంటాయి” అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బాధితులందరికీ న్యాయం:
ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ…తమ సుప్రీం లీడర్ అలీ ఖామేనీ హత్యతో పాటు మృతి చెందిన ప్రతి ఇరాన్ పౌరుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతర్జాతీయ, న్యాయపరమైన మార్గాల ద్వారా బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అమెరికా డ్రోన్ కూల్చివేత:
బందర్ అబ్బాస్ ప్రాంతంలో అమెరికాకు చెందిన “లూకాస్-రకం” డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ బహ్రెయిన్, కువైత్, ఖతార్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు పేర్కొంది. కాగా, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దాడులకు దిగడం ఐక్యరాజ్యసమితి చారటర్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాషింగ్టన్ తమ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపింది. అమెరికా దళాలు తమపై దాడులు చేయడానికి ఏ దేశమైనా తన భూభాగాన్ని లేదా సైనిక సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే, ఆయా దేశాలను ఇరాన్ శత్రుదేశాలుగా పరిగణిస్తుందని హెచ్చరించింది.
డజన్ల కొద్దీ లక్ష్యాలను ఛేదించాం: అమెరికా
యుద్ధ విమానాలు, నౌకలు, డ్రోన్లతో ఇరాన్‌లోని డజన్ల కొద్దీ లక్ష్యాలపై దాడులు నిర్వహించామని… వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్లు, క్షిపణి, డ్రోన్ మౌలిక సదుపాయాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హోర్మూజ్ జలసంధిలో పౌర నౌకాయానానికి ముప్పు తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
మా పౌరులపై దాడులు: ఇరాన్‌పై బహ్రెయిన్ సైన్యం ఆరోపణ
ఇరాన్ తమ దేశంలోని పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని బహ్రెయిన్ సైన్యం సోమవారం ఆరోపించింది. బహ్రెయిన్ సైన్యం జనరల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో, ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల ద్వారా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా దాడులు చేస్తోందని పేర్కొంది. సోమవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయని తెలిపింది.
బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించిన తర్వాత బహ్రెయిన్ ఈ ఆరోపణలు చేసింది. మరోవైపు, ఇరాన్‌లోని మధ్య ప్రాంతమైన నైన్ నగరంలోని సైనిక స్థావరంపై అమెరికా జరిపిన దాడిలో కనీసం ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అంతకుముందు మహ్షహర్‌లో జరిగిన మరో అమెరికా దాడిలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
తగ్గిన నౌకల రాకపోకలు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఐదు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఆదివారం కేవలం ఆరు నౌకలు మాత్రమే ఆ మార్గం గుండా ప్రయాణించినట్లు షిప్పింగ్ సమాచారం వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు