వేధింపులు, లాకప్ హత్యలు ఆందోళనకరం
- కప్పిపుచ్చుతున్న కూటమి సర్కారు
- రాజధాని రైతులపై దౌర్జన్యం సరికాదు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం విమర్శ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ‘రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోలీస్ స్టేషన్‌లలో వేధింపులు, లాకప్ హత్యలు పెరుగుతున్నాయి. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ లాకప్ డెత్, మృతదేహం అదృశ్యం, అప్పటి సీఐ నాగరాజు వేధింపులు తాళలేక విజయవాడలో క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడం, కర్నూలు జిల్లాలో అదృశ్యమైన కొడుకు ఆచూకీ చెప్పమని అడిగిన తల్లి గంగమ్మను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపేయడం వంటి ఘటనలు ప్రజల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి’ అని సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడ దాసరి భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యతోపాటు జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ సత్యనారాయణమూర్తి, అక్కినేని వనజ, పి.హరినాథరెడ్డి, తాటిపాక మధు, డేగా ప్రభాకర్, డి.జగదీశ్, జంగాల అజయ్కుమార్, పి.దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించిన తర్వాత కీలక తీర్మానం చేసినట్లు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. ‘రక్షక భటులే రాక్షసులుగా తయారవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం లాకప్ డెత్లను కనుమరుగు చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. అందులో భాగంగానే ప్రశ్న రావణ్‌పై అనేక పోలీస్ స్టేషన్‌లలో కేసులు బనాయించడం, ఉపా చట్టం ప్రయోగించడం వంటివి చేసి… చర్చను పక్కదారి పట్టిస్తున్నది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోలీసు వ్యవస్థ కొమ్ముకాయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు అధికార పార్టీల అడుగులకు మడుగులొత్తడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విధానాలు, చర్యల పట్ల సీపీఐ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బీజేపీ అజెండా నెత్తికెత్తుకున్నారు. హిందూత్వం, సనాతనవాదం వంటి తిరోగమన విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రశ్నించే, విమర్శించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల అనేక మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ దుందుడుకు చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం.
అమరావతి రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి, వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన పరిహారం చెల్లించే ప్రయత్నం చేయకుండా దౌర్జన్యంగా భూములు స్వాధీనం చేసుకోవడం సరైందికాదు. మార్కెట్ ధర ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని, పంటపొలాలను ధ్వంసం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. విశాఖపట్నం ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ వేగవంతం చేసింది. గూగుల్ డేటా సెంటర్ కోసం సుమారు 308 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా బలవంతంగా భూములు తీసుకోవడం అన్యాయం. కూటమి ప్రభుత్వ బలవంతపు భూసేకరణ విధానాలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నది.
పొగాకు, మామిడి, ఆక్వా రైతుల పెట్టుబడి వ్యయాలు పెరగడం, మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు పడిపోవడం, అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు పడిపోకుండా, సిండికేట్ గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి వర్జీనియా పొగాకు ధర కిలో రూ.200కి తగ్గకుండా చూడాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు కంపెనీలను ఆదేశించారు. తోతాపురి మామిడికి సరైన ధర లేక రైతులు నష్టపోతున్నారు. తోతాపురి మామిడి రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం చెల్లిస్తామని చెబుతోంది. ఆక్వా రంగానికి మేత (ఫీడ్) ధరలు విపరీతంగా పెరగడం వల్ల రైతులపై తీవ్రమైన పెట్టుబడి భారం పడింది. చంద్రబాబు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులతో చర్చలు జరిపగా ఆక్వా ఫీడ్ ధరను కిలోకు రూ.4 మేర తగ్గించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. రైతాంగాన్ని ఎంతో ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు ఆచరణకు నోచుకోక మాటలకే పరిమితమవ్వడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు, మామిడి, ఆక్వా రైతాంగాన్ని ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా వస్తున్నాయని, నూతన పరిశ్రమలు ఏర్పడుతున్నాయని కూటమి ప్రభుత్వం ఊదరగొడుతున్నది. ఆచరణలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడేన్నట్లుగా ఉన్నది. రెండేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల వివరాలను సమగ్రంగా వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది’.


