- విజిలెన్స్ విచారణ పేరుతో కక్ష సాధింపు
- హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
- ఆంధ్ర వర్సిటీని సంక్షోభంలోకి నెట్టే ఎత్తుగడ
- ‘డీమ్¦’కు మేలు చేకూర్చేలా ప్రణాళిక
- ఆర్థిక వనరుల కోర్సులపై కుట్ర
- నిలిచిన తరగతులు… విద్యార్థుల ఆందోళన
విశాలాంధ్ర- విశాఖపట్నం: ఉన్నత విద్యాభ్యాసానికి మకుటాయమానంగా నిలిచే ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో బోధన సంక్షోభం నెలకొంది. 20 ఏళ్లుగా శాశ్వత అధ్యాపకుల నియామకాలు జరగకపోవడంతో కొట్టుమిట్టాడుతోంది. వర్సిటీలో మొత్తం 956 మంది అధ్యాపకులకు గాను ప్రస్తుతం 194 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 762 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి గడ్డు కాలంలో బోధనకు అంతరాయం కలగకుండా, ‘నాక్’ ప్రమాణాలు కాపాడుతున్న సహాయక, తాత్కాలిక అధ్యాపకులను విజిలెన్స్ విచారణ పేరుతో ఉన్నపళంగా తొలగించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల 12 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించిన యాజమాన్యం, తాజాగా మరో 30 మంది అనుబంధ అధ్యాపకులను పక్కన పెట్టడం వర్సిటీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదంతో ఇంజినీరింగ్, న్యాయశాఖ, జియాలజీ, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, పర్యావరణ శాస్త్రాలు వంటి కీలక విభాగాల్లో నిబంధనల ప్రకారమే అనుబంధ అధ్యాపకులను నియమించింది. గతంలో ‘నాక్’ బృందం సైతం ఈ విద్యావిధానాన్ని, అధ్యాపకుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. అయితే, ప్రస్తుత ఉపకులపతి (వీసీ) విజిలెన్స్ అభ్యంతరాలను సాకుగా చూపుతూ వీరి సేవలను నిలిపివేశారు. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో గత 15 రోజులుగా తరగతులు పూర్తిగా స్తంభించిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, లా కాలేజీలతో పాటు వివిధ కీలక ఇంజినీరింగ్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏయూకి బంగారు బాతుల్లాంటి కోర్సులను ఇలా నడిరోడ్డుపై పడేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమాచారం ప్రకారం… కంప్యూటర్ సైన్స్, ఈసీఈ విభాగాలు కలిసి విశ్వవిద్యాలయానికి ఏడాదికి సుమారు రూ. 50 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ద్వారా రూ. 10 కోట్ల వరకు రాబడి వస్తోంది. వర్సిటీకి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్న ఈ కోర్సులను బోధన లేకుండా నిర్వీర్యం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏయూలో నాణ్యమైన విద్యను క్రమంగా దెబ్బతీసి, పరోక్షంగా కార్పొరేట్, ప్రైవేట్ లేదా డీమ్¦ విశ్వవిద్యాలయాలకు మేలు చేయడానికే ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారనే బలమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేదంటూ గత ప్రభుత్వ హయాంలో (2019-2024) నియమితులైన అనుబంధ, కాంట్రాక్ట్ అధ్యాపకులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. తాజాగా వర్సిటీ యాజమాన్యం ‘టీచింగ్ టెంపరరీ అసిస్టెంట్స్’ (టీటీఏ) పేరుతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఎందుకు విజిలెన్స్ మౌనంగా ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజిలెన్స్ నిజాయితీగా 2025లో వర్సిటీ ఇంజినీరింగ్ కోర్సులకు ఎన్‌బీఏ అక్రెడిటేషన్ ఎందుకు తిరస్కరించబడిందో విచారణ చేయాలని విద్యార్థి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సహాయక, తాత్కాలిక నియామకాలకు ప్రభుత్వ అనుమతి లేదంటున్న వీసీ, మరి ఇప్పుడు ప్రవేశపెడుతున్న టీటీఏలకు మాత్రం ప్రభుత్వ సమ్మతి ఉందా అని అధ్యాపక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకే తరహా విధులకు రెండు వేర్వేరు ప్రమాణాలు ఎలా పాటిస్తారని, టీటీఏ నియామకాలపై విజిలెన్స్ ఎందుకు మౌనం వహిస్తోందని విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి. ఇటీవల కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవల కొనసాగింపుపై హైకోర్టు స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వర్సిటీ యాజమాన్యం వాటిని బేఖాతర్ చేస్తోంది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, వాటిని సవాలు చేస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తుండటం కక్షసాధింపు ధోరణికి అద్దం పడుతోంది. పైగా, పాత కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవల పొడిగిస్తూ, కేవలం గత ఐదేళ్లలో చేరిన వారిపైనే వేటు వేయడం వెనుక రాజకీయం ఉందనేది స్పష్టమవుతోంది. దీంతో సహాయక, కాంట్రాక్ట్ అధ్యాపకులు రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వారు గవర్నర్‌ను లేఖలో కోరారు. రాజకీయాలు మారినప్పుడల్లా విద్యా సంస్థల్లోని నియామకాలను రద్దు చేసుకుంటూ పోతే ఉన్నత విద్యా రంగం భవిష్యత్తు ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం జరిగిన ఇంటర్వ్యూలకు విలువ లేదా…యూజీసీ గైడ్‌లైన్స్ను వర్సిటీలు పట్టించుకోవా… ఈసీ (పాలకవర్గం) నిర్ణయాలకు విలువ లేనప్పుడు ఇక ‘ఏయూ పాలకవర్గం’ ఎందుకు, ఇదే సంస్కృతిని రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తే వర్సిటీల గతి ఏం కాను అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఛాన్స లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని మేధావి వర్గాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే సహాయక, కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను పునరుద్ధరించి, వర్సిటీలో ఒకే విధమైన నిబంధనలను అమలు చేయాలని సర్వత్రా కోరుతున్నారు.


