. విద్య కంటే విదేశీ రుణాల చెల్లింపులకే అధిక వ్యయం
. యునెస్కో తాజా నివేదిక వెల్లడి
న్యూయార్క్: అభివృద్ధి చెందుతున్న దేశాలు విద్యాభివృద్ధి కంటే విదేశీ రుణాల చెల్లింపులకే ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) తాజా నివేదిక వెల్లడించింది. 2025లో మొత్తం 113 అభివృద్ధి చెందుతున్న దేశాలు విద్యపై చేసిన ఖర్చు కంటే విదేశీ రుణాల సేవ (డెట్ సర్వీసింగ్) కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని, అక్కడ విద్యపై ఖర్చు చేసిన దానికంటే సగటున 3.6 రెట్లు ఎక్కువ మొత్తాన్ని రుణాల చెల్లింపులకు వెచ్చించినట్లు యునెస్కో తెలిపింది.
విద్యా రంగానికి విదేశీ సాయం తగ్గుముఖం
ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగానికి అందుతున్న విదేశీ సాయం కూడా గణనీయంగా తగ్గుతున్నట్లు నివేదిక హెచ్చరించింది. తక్కువ ఆదాయం, దిగువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు 2023తో పోలిస్తే ఇప్పటికే 21 శాతం విద్యా సహాయాన్ని కోల్పోయాయని, 2027 నాటికి ఈ తగ్గుదల 30 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అఫ్గానిస్థాన్, మాలి, నైజర్, లైబీరియా వంటి దేశాలు గత మూడేళ్లలోనే విద్యా రంగానికి అందే విదేశీ సహాయంలో 40 శాతానికి పైగా కోల్పోయినట్లు వెల్లడించింది.
పాఠశాలల నిర్వహణపై తీవ్ర ప్రభావం
అమెరికా, యూరప్ దేశాలు విదేశీ సాయాన్ని తగ్గించడం వల్ల 2024లోనే విద్యా రంగానికి అందే నిధులు 600 మిలియన్ డాలర్లు తగ్గాయని, 2025లో ఈ తగ్గుదల మరింత పెరిగి ఉండొచ్చని నివేదిక పేర్కొంది. రుణాల చెల్లింపుల కోసం ప్రభుత్వాలు నిధులను మళ్లించడంతో పాఠశాలలకు సరిపడా నిధులు అందకపోవడం, ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించింది.
అభివృద్ధికి అడ్డంకిగా రుణ భారం
యునెస్కో విద్యా విభాగం డైరెక్టర్ మిన్ జియాంగ్ కిమ్ మాట్లాడుతూ, ప్రస్తుత రుణ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను పొదుపు చర్యలు, తక్కువ పెట్టుబడులు, మందగించిన అభివృద్ధి అనే దుష్ట చక్రంలో బంధిస్తున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల ఆర్థిక వృద్ధి దెబ్బతింటోందన్నారు. ప్రభుత్వాల ఆదాయ వనరులు బలహీనపడుతున్నాయని, భవిష్యత్తులో రుణ భారం నుంచి బయటపడే సామర్థ్యం కూడా తగ్గిపోతోందని తెలిపారు.
శ్రీలంక పరిస్థితి అత్యంత దారుణం
అత్యధిక రుణభారంతో ఉన్న 18 దేశాలు విద్యపై చేసిన ఖర్చు కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని రుణాల చెల్లింపులకు వెచ్చించినట్లు నివేదిక తెలిపింది. శ్రీలంకలో అయితే ఈ వ్యత్యాసం 16 రెట్లు ఉన్నట్లు వెల్లడించింది.
35 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరిన రుణ చెల్లింపులు
బ్రిటన్‌కు చెందిన ‘డెట్ జస్టిస్’ అనే సంస్థ అంచనా ప్రకారం, గత ఏడాది పేద దేశాల రుణ చెల్లింపులు 35 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 56 దేశాలు తమ ప్రభుత్వ ఆదాయంలో దాదాపు ఐదో వంతు రుణాల చెల్లింపులకే ఖర్చు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. డెట్ జస్టిస్ పాలసీ డైరెక్టర్ టిమ్ జోన్స్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి, ఇంధన ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపు, వాతావరణ విపత్తులు వంటి పరిణామాల కారణంగా రుణ చెల్లింపులు భారీగా పెరిగాయని చెప్పారు. దీనివల్ల అనేక దేశాలు ఆరోగ్యం, విద్య వంటి అత్యవసర సేవలపై ఖర్చును తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రుణ ఉపశమన విధానాల్లో మార్పులు అవసరం
ప్రజా సేవలకు నిధుల కేటాయింపు కొనసాగేందుకు వీలుగా దీర్ఘకాలిక రుణ ఉపశమన విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని యునెస్కో సూచించింది. అలాగే, బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రైవేటు రుణదాతలు అధిక లాభాల కోసం రుణ ఉపశమన ఒప్పందాలను అడ్డుకోవకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. 2027లో జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న బ్రిటన్ ఈ అవకాశాన్ని ఉపయోగించి రుణ ఉపశమన విధానాల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని, అవసరమైన చోట రుణ మాఫీతో పాటు వేగవంతమైన ఉపశమన ప్రక్రియను అమలు చేయాలని డెట్ జస్టిస్ సంస్థ విజ్ఞప్తి చేసింది.


