Homeఎరువుల ఇక్కట్లు

ఎరువుల ఇక్కట్లు

- Advertisement -
  • అచ్చెన్నాయుడు ఇలాకాలో కొరత
  • క్యూ లైన్‌లో మహిళా రైతు మృతి
  • కాంప్లెక్స్‌ ఎరువుల ధరలతో సాగు భారం
  • రైతు సమస్యలపై కూటమి నిర్లక్ష్యం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఖరీఫ్ సాగు కీలక దశకు చేరుకున్న సమయంలో ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వ్యవసాయానికి అత్యంత అవసరమైన యూరియా, డీఏపీ (డై అమ్మోనియం ఫాస్పేట్) వంటి ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చోటుచేసుకున్న మహిళా రైతు మరణం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వేదికగా చర్చకు దారితీసింది. ఎరువుల కోసం క్యూ లైన్‌లో వేచి చూస్తూ మహిళా రైతు కాంతమ్మ అస్వస్థతకు గురై కుప్పకూలి మృతి చెందడం రైతాంగాన్ని కలిచివేసింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం, వ్యవసాయ అవసరాలు, ఎరువుల సరఫరాపై ఎంత మేరకు ప్రాధాన్యత ఉందనే అంశంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. కాంతమ్మ ఎరువులు పొందేందుకు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ సరఫరా ఆలస్యం కావడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని, ఈ నిరీక్షణలోనే ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలి మృతి చెందిందని సమాచారం. ఈ ఘటనపై రైతు సంఘాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు ఇది ప్రతీకగా నిలిచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నప్ప టికీ రైతులకు ఇచ్చిన హామీల అమలుకు పూర్తిగా కృషి చేయలేదు. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ విఫలమైందన్న విమర్శలున్నాయి. పంట వేసుకునే సమయంలో అవసరమైన ఎరువులను సరఫరా చేయడం లేదు. ఇటీవల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విజయవాడ కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం అధ్వర్యంలో ముఖ్యమంత్రికి రాయబారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ‘చలో సీఎం క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున ప్రదర్శనగా రైతులు బయలుదేరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ రైతాంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోందని పేర్కొంటున్నాయి. రైతు సంక్షేమం, సాగు అవసరాలు, మార్కెట్ సమస్యలు, ఎరువుల సరఫరా అంశాల కంటే… భారీ నిర్మాణాలు, పెట్టుబడి ప్రాజెక్టులు, కమీషన్‌లు వచ్చే పనుల పైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోందన్న వాదనలున్నాయి. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయినప్పటికీ రైతాంగ సమస్యల పరిష్కారంలో ఆశించిన చొరవ కనిపించడం లేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
యాప్‌లతో రైతుల్లో గందరగోళం
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా, డీఏపీ వంటి ఎరువులకు అత్యధిక డిమాండ్ నెలకొంది. ఎరువుల వినియోగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లో వెబ్ ల్యాండ్‌లో నమోదయిన భూములు, ఈ-పంటలో నమోదు చేసిన సాగు విస్తీర్ణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని యూరియా, డీఏపీ ఎరువులను పంపిణీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధానం రైతులకు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూ రికార్డుల్లో పేర్లు మారకపోవడం, ఈ-పంట నమోదులో సాంకేతిక సమస్యలు, కౌలు రైతుల వివరాలు సక్రమంగా నమోదు కాకపోవడం కారణాలతో ఎరువులు పొందలేకపోతున్నారని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు బస్తాల వరకు యూరియా అవసరమవుతుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఒక్క బస్తా, మరికొన్ని ప్రాంతాల్లో రెండు బస్తాలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం సరఫరా చేస్తోందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో మిగిలిన అవసరాలను తీర్చుకోవడానికి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా నమోదు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుండటంతో రైతులు డీఏపీ కొనుగోలుపై ఆధారపడుతున్నారు. డీఏపీ సరఫరా పరిమితంగానే ఉండటంతో దాని కోసం అనేక రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. రైతు సేవా కేంద్రాలు సూచించిన నిర్దిష్ట ఎరువుల దుకాణాల నుంచే కొనుగోలు చేయాల్సి రావడం మరో సమస్యగా మారింది. ఆ దుకాణాలు గ్రామాలకు దూరంగా ఉన్నా రైతులు అక్కడికి వెళ్లి గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ తరహా పరిస్థితుల్లోనే టెక్కలిలో మహిళా రైతు కాంతమ్మ ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వం అధికారికంగా ఎరువుల కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. యూరియా, డీఏపీ సరిపడా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పంపిణీ వ్యవస్థలో లోపాలు, పర్యవేక్షణ లోపం కారణంగా రైతులకు సమయానికి ఎరువులు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎరువుల ధరల భారం
ఒకవైపు ప్రభుత్వం యూరియా, డీఏపీ పంపిణీపై పరిమితులు విధిస్తుండగా, మరోవైపు ప్రత్యామ్నాయంగా రైతులు వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. 50 కిలోల కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా… గతం కంటే రూ.700 ధర అదనంగా పెరిగింది. దీంతో రైతులపై మరింత సాగు భారం పడనుంది. విత్తనాలు, పురుగు మందులు, కూలీ ఖర్చులు ఇప్పటికే భారీగా పెరిగిన పరిస్థితుల్లో ఎరువుల ధరల పెరుగుదల రైతాంగానికి మరింత భారంగా మారుతోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులను రైతులకు అవసరమైన మేరకు సకాలంలో అందుబాటులో ఉంచాలి. ఎరువుల సరఫరా వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలి. రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడే పరిస్థితులు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. టెక్కలిలో మహిళా రైతు కాంతమ్మ మృతి వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు