ఆగస్టు 14న అనకాపల్లికి గోదావరి జలాలు
- 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు వేగంగా పూర్తి
- పోలవరం రాష్ట్రానికి జీవనాడి…
- దశాబ్దాల కల సాకారం చేస్తున్నాం
- ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో`ఏలూరు: పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేసి రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆగస్టు 14న అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలకు స్వాగతం పలుకుతామని, స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందే నీటిని విడుదల చేసి అక్కడే అఖండ హారతి నిర్వహిస్తామని వెల్లడించారు. పోలవరం పనుల పురోగతిని ఇకపై ప్రతీ నెల ప్రజలకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌లో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని సీఎం స్పష్టం చేశారు. 1996లో ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, మళ్లీ తానే పూర్తి చేస్తున్నానని అన్నారు. ‘గత పాలకులు పూర్తి కాకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. టీబీఎం తీయకుండానే ప్రాజెక్టు పూర్తి అయిందని ప్రజలను మభ్యపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అనకాపల్లికి, అనంతరం విశాఖకు గోదావరి జలాలు అందించి… తదుపరి గోదావరి-నాగావళి నదుల అనుసంధానాన్ని చేపడతాం. పోలవరం రాష్ట్రానికి జీవనాడి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మొదటి దశ, రెండోదశ పూర్తయితే ప్రాజెక్టులో 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందన్నారు. వరద జలాల్లో మరో 200 టీఎంసీలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని సీఎం చెప్పారు. 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందని, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, 28.5 లక్షల మందికి తాగునీరు అందించవచ్చని వివరించారు. 23.44 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవచ్చని, జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. హైబ్రిడ్ మోడల్‌లో పంప్¦ స్టోరేజ్ అవకాశాలను పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. 2014లో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశామని, నిర్వాసితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికే పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని, పునరావాస బాధ్యతను నెరవేర్చేం దుకు కట్టుబడి పనిచేశామని తెలిపారు. గతంలో పరిహారం విష యంలో అనేక ఫిర్యాదులు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. నిజమైన అర్హులకు న్యాయం చేస్తున్నామని, ఒక ప్రాజెక్టు వల్ల కొందరు లాభపడితే మరికొందరు నష్టపోతారని, నష్టపోయిన వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 2019 నాటికే పోలవరం పనుల్లో 72 శాతం పూర్తి చేశామని, అనంతరం వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాజెక్టుపై కక్షపూరిత ధోరణి ప్రదర్శించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. టెండర్లు రద్దు చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించినా పట్టించుకోలేదన్నారు. రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా గుర్తించలేదని, దానిని మళ్లీ నిర్మించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అదే డయాఫ్రం వాల్పై ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుపై 136 సార్లు సమీక్ష నిర్వహించానని, కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు చర్చించి నిధులు విడుదల చేయించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమర్థవంతంగా పనిచేస్తోందని, అధికారులు సమయం కేటాయించి పనులు వేగంగా పూర్తయ్యేలా మార్గనిర్దేశనం చేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టామని, ప్రస్తుతం మొత్తం పనుల్లో 89 శాతం పూర్తయ్యా యని వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. స్పిల్వే, రేడియల్ గేట్లు, కాఫర్ డ్యాం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా గేట్ల ఏర్పాటు జరుగుతోందన్నారు. గ్యాప్-1లో 40 శాతం, గ్యాప్-2లో 30 శాతం, గ్యాప్-3లో 100 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రణాళిక ప్రకారమే పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 94,152 ఎకరాల భూమి సేకరించామని, అక్టోబర్ 2026 నాటికి భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. పునరావాసం కింద ఇప్పటికే 17,500 కుటుంబాలను తరలించామని, 2027 మార్చి నాటికి మిగిలిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో 17,118 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులు కూడా 2027 మార్చికల్లా పూర్తి అవుతాయని వెల్లడించారు. కుడికాల్వ ఎర్త్వర్క్స్ 100 శాతం పూర్తయ్యాయని, ఎడమకాల్వ ఎర్త్వర్క్స్ 99 శాతం పూర్తయ్యా యని తెలిపారు. కుడికాల్వపై స్ట్రక్చర్లలో మరో 4 శాతం మాత్రమే మిగిలి ఉందని, ఎడమకాల్వ స్ట్రక్చర్లు 83 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. లెఫ్ట్, రైట్ ఇరిగేషన్ టన్నెల్ పనులు 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. మొదటి దశ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.30,436 కోట్లకు ఆమోదం తెలిపిందని, గత రెండేళ్లలోనే రూ.8,823 కోట్లు విడుదల చేసిందన్నారు. అందులో రూ.7,100 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3,835 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. 22,058 నిర్వాసిత కుటుంబాలకు రూ.2,250 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని, ఇంటి స్థలం కొను గోలు చేసుకునే వారికి అదనంగా రూ.2 లక్షలు ఇస్తున్నామని ముఖ్య మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను అటకెక్కించిందని, వాటితో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను సరిచేస్తే మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. జలధార-జలహారతి పనులను రూ.3,300 కోట్లతో ప్రారంభించామని, సర్దుబాటు పనుల కోసం ప్రతి జిల్లా కలెక్టర్‌కు అదనంగా రూ.2 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలనలో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు సైట్‌కు చేరుకున్న చంద్రబాబుకు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారధి పూల మొక్కలు అందించి ముఖ్యమంత్రికి సాదరంగా ఆహ్వానం పలికారు. అంతకుముందు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.


