రంగంలోకి కేంద్రం – ఆమోదించవద్దని ఆదేశం
న్యూదిల్లీ: చంద్రయాన్తో ప్రపంచ దృష్టి ఆకర్షించిన ఇస్రోకు తాజాగా సరికొత్త సవాల్ ఎదురైంది. గగన్‌యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లు ముందున్న సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల రాజీనామాలు చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలపై అప్రమత్తమైన కేంద్రం… కీలక సిబ్బంది రాజీనామాల కట్టడి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల నిష్క్రమణ అంశం ప్రధాన చర్చగా మారింది. ఇస్రో వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం… ఇటీవల కాలంలో 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు. ముఖ్యంగా బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్కువ మంది నిపుణులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో ఉపగ్రహాలు, రాకెట్లు, మానవ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక విభాగాల్లో పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది. గగన్‌యాన్ సహా దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఇలాంటి దరఖాస్తులను సాధారణంగా ఆమోదించకుండా… ఉన్నతస్థాయి పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇస్రో కేంద్రాలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇస్రో బలం కేవలం సాంకేతిక పరికరాలు కాదు… వాటిని అభివృద్ధి చేసే శాస్త్రవేత్తల అనుభవం. ఒక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడానికి వెనుక ఏళ్ల తరబడి సాగే పరిశోధనలు, వందలాది పరీక్షలు, ఎన్నో వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. గగన్‌యాన్ మిషన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అంతేకాకుండా భవిష్యత్‌లో భారత అంతరిక్ష కేంద్రం, మరిన్ని చంద్ర అన్వేషణ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు బయటకు వెళ్లడం సంస్థకు సవాల్‌గా మారింది. నిపుణుల స్థానాల్లో కొత్త వారిని నియమించడం సాధ్యమైనప్పటికీ… ఒక నిర్దిష్ట మిషన్‌పై సంవత్సరాల పాటు పనిచేసిన వారి అనుభవాన్ని వెంటనే భర్తీ చేయడం అంత సులభమేమీ కాదు. ఇస్రో నుంచి శాస్త్రవేత్తల నిష్క్రమణకు ప్రధాన కారణంగా ప్రైవేట్ స్పేస్ రంగం విస్తరణ కనిపిస్తోంది. కొన్నేళ్లలో భారత్‌లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు పెరిగాయి. రాకెట్లు, ఉపగ్రహాలు, స్పేస్ టెక్నాలజీపై పనిచేసే స్టార్టప్‌లు వేగంగా ఎదుగుతున్నాయి. ఇస్రోలో సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకు ఈ సంస్థల్లో అధిక వేతనాలతో పాటు కొత్త ప్రయోగాల్లో భాగస్వామ్యం, నిర్ణయాధికారం, కొన్నిసార్లు సంస్థల్లో వాటాల అవకాశాలు కూడా లభిస్తున్నాయి. దీంతో కొందరు శాస్త్రవేత్తలు కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్రోలో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ… ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం సంఖ్య కాదు… నాణ్యత. ఒక ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త వెళ్లిపోతే… ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్త వ్యక్తికి సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే గగన్‌యాన్, ఇతర జాతీయ ప్రాధాన్యత కలిగిన మిషన్లలో పనిచేసే గ్రూప్-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను నేరుగా కేంద్ర అంతరిక్ష శాఖ పరిశీలించేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని స్థాయిల వరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకే రాజీనామాలు ఆమోదించే అధికారం ఉండేది. ఇప్పుడు కీలక మిషన్లకు సంబంధించిన సిబ్బంది విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది.
శాస్త్రవేత్తల రాజీనామాలపై ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ స్పందిస్తూ సంస్థ నుంచి ఉద్యోగులు వెళ్లడం సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఒకరి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అయితే కీలక ప్రాజెక్టులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో భారత్ కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమవుతున్న వేళ… ఇస్రోలో కొనసాగుతున్న ఈ టాలెంట్ ఎగ్జిట్‌ను సంస్థ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రయాన్ విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో… ఇప్పుడు గగన్‌యాన్ వంటి చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను నిలుపుకోవడం సంస్థ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది.


