Homeరామ మందిర విరాళాల చోరీపై కేంద్రాన్ని నిలదీస్తాం

రామ మందిర విరాళాల చోరీపై కేంద్రాన్ని నిలదీస్తాం

- Advertisement -

రాజ్యాంగ సవరణ బిల్లులను ఓడిస్తాం
డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
కాంగ్రెస్ స్పష్టీకరణ

న్యూదిల్లీ: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అయోధ్య రామమందిరంలో భక్తుల విరాళాల చోరీ, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవకతవకలు తదితర కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయను న్నట్లు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటిం చింది. అలాగే నియోజకవర్గాల పునర్విభ జన (డీలిమిటేషన్), మంత్రులు, ముఖ్య మంత్రుల తొలగింపునకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించి ఓడించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కానుండగా… కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో గురువారం కీలక సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్, పి.చిదంబరం, కె. సురేష్, నసీర్ హుస్సేన్, మాణికం ఠాగూర్, కుమారి సెల్జా, తారిక్ అన్వర్, శశి థరూర్, మనీశ్ తివారీ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మల్లికార్జున ఖడ్గే ‘ఎక్స్’లో స్పందిస్తూ…అయోధ్య రామమందిర విరాళాల చోరీ, ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థ క్షీణత, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతకు భంగం, రాజకీయ పార్టీల చీలికలు, అవినీతి కుంభకోణాలు, ధరల పెరుగుదల, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులపై జరుగుతున్న దాడులు వంటి అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. కాగా, జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నిస్తు న్నారన్నారు. ఏప్రిల్ 17న ప్రభుత్వం మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంలో విఫలమైందని, ఇప్పుడు మళ్లీ అదే బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తోందన్నారు. అలాగే తీవ్రమైన నేరాల్లో 30 రోజులపాటు జైలులో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించే రాజ్యాంగ సవరణ బిల్లుపైనా సమావేశంలో చర్చ జరిగిందన్నారు. డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని, ఇకపై కూడా అదే వైఖరి కొనసాగిస్తామని జైరాం స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. మంత్రుల తొలగింపుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చ జరిగిందని, దీనిపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటైందని వెల్లడించారు. వికసిత్ భారత్ శిక్ష± అధిష్ఠాన్, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లులను కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం-2013లో ప్రతిపాదించిన సవరణలపై కూడా సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు ఆధారమైన ఈ చట్టంలో మార్పులను కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, బిల్లు ప్రవేశపెడితే గట్టిగా ప్రతిఘటిస్తామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతు ఇవ్వగల బిల్లు ఏదీ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ప్రస్తుత స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో మెజారిటీ కోసం రాజకీయ పార్టీలను చీల్చేందుకు కేంద్ర హోంమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందని విమర్శించారు. అయితే బీజేపీ లోక్‌సభలో మూడింత రెండొంతుల మెజారిటీ సాధించలేదని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన అన్ని పార్టీలతో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖడ్గే నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. వర్షాకాల సమావేశాలకు ముందు సోమవారం ఇండియా ఐక్యసంఘటన వ్యూహాత్మక సమావేశం నిర్వహించనుండగా, ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం డీలిమిటేషన్, లోక్‌సభ స్థానాల పెంపు, జైలుశిక్ష పడిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల తొలగింపుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులతో పాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, పెరుగుతున్న చమురు ధరలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష ఇండియా ఐక్యసంఘటన నిర్ణయించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు