Homeఈడీ దూకుడు

ఈడీ దూకుడు

- Advertisement -
  • మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు వేగవంతం
  • కస్టడీకి వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్
  • నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా పేర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్ కుమార్లను నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులను ఈడీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల కస్టడీ విచారణలో నిందితులను వేర్వేరుగా ప్రశ్నించడంతో పాటు, అవసరమైతే ఎదురెదురుగా కూర్చోబెట్టి ముఖాముఖి విచారణ జరిపేందుకు అధికారులు వ్యూహాత్మక ప్రశ్నలను సిద్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి తన అధికార పరిధిని దుర్వినియోగం చేస్తూ, చట్టబద్ధంగా కొనసాగుతున్న జిల్లా స్థాయి వికేంద్రీకృత మద్యం రవాణా విధానాన్ని ఉద్దేశపూర్వ కంగా రద్దు చేశారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏకీకృత రాష్ట్ర స్థాయి రవాణా విధానాన్ని ప్రవేశపెట్టి, దిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌ అనే సంస్థకు టెండర్ దక్కేలా చేశారన్న ప్రచారం ఉంది. ఈ టెండర్ ప్రక్రియలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.195.33 కోట్ల భారీ నష్టం వాటిల్లేలా చేశారని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఆ మొత్తం వ్యవహారంలో సిగ్మా సంస్థ కేవలం ఒక ముసుగులా మాత్రమే పనిచేసిందని, రవాణా ద్వారా వచ్చిన లాభాలలో దాదాపు 95 శాతానికి పైగా నిధులను కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని మద్యం ముఠా అక్రమంగా సొంతం చేసుకుందని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు, ఈ అక్రమ రవాణా ద్వారా ఆర్జించిన కోట్లాది రూపాయల నిధులను వివిధ షెల్ కంపెనీలైన అరోయో సర్వీసెస్, ఈజీ లోడ్ నెట్‌వర్క్, టెక్కర్ వంటి సంస్థల ద్వారా మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా, హవాలా మార్గాల్లో చేతులు మార్చినట్లు కూడా బలమైన ఆధారాలు సేకరించారు. గతంలో నిందితుల ఇళ్లపై జరిపిన సోదాల్లో లగ్జరీ రోలెక్స్‌ వాచీలు, రేంజ్ రోవర్ కార్లతో పాటు హవాలా లావాదేవీలకు సంబంధించిన ఫోటోలు, కీలక పత్రాలు ఈడీ స్వాధీనం చేసుకుంది. మూడు రోజుల కస్టడీలో భాగంగా నిధుల మళ్లింపు ఎలా జరిగింది… దీని వెనుకున్న ఇతర రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు