: జర్నలిస్ట్ కుమార్తె నిత్యశ్రీ ఉన్నత చదువులకు రూ.50,000 ఆర్థిక సాయం
విశాలాంధ్ర-రాప్తాడు( అనంతపురం జిల్లా) : కష్టాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంలో తానెప్పుడూ ముందుంటానని ప్రముఖ సామాజిక వేత్త ప్రొఫెసర్ సాకే రాజేష్ మరోసారి చాటుకున్నారు. రాప్తాడు మండల కేంద్రానికి చెందిన విశాలాంధ్ర విలేకరి బుడగల శ్రీనివాసులు కుమార్తె నిత్యశ్రీ ఉన్నత చదువుల కోసం ఆయన శుక్రవారం రూ.50,000 ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు ఎంజేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ పూర్తి చేసిన బుడగల నిత్యశ్రీ, ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గానూ 978 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచింది. ఇటీవల శ్రీనివాసులు సతీమణి ఉమాదేవి మరణంతో ఆ కుటుంబం కష్టాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ప్రొఫెసర్ సాకే రాజేష్, వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. తల్లి లేని లోటు ఉన్నప్పటికీ నిత్యశ్రీని, అక్షయ్ సాగర్ ను మరింత బాగా చదివించాలని సూచించారు.
ఈ చెక్కు మొత్తాన్ని నిత్యశ్రీ ఉన్నత చదువుల కోసమే వినియోగించాలని కోరుతూ, భవిష్యత్తులోనూ ఆమె చదువుకు తన వంతు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కష్ట కాలంలో తమకు బాసటగా నిలిచి, నిత్యశ్రీ చదువుకు ఆర్థిక సాయం అందించిన ప్రొఫెసర్ సాకే రాజేష్‌కు జర్నలిస్ట్ శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు సాకే కృష్ణమూర్తి, సాకే కమలమ్మ, పెద్దమ్మ కుమారి, సాకే రాజశేఖర్, సాకే కళావతి,
సాకే అరుణ్ కుమార్, సాకే జ్యోతి, కృతజ్ఞతలు తెలియజేశారు.


