పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు
చెన్నై: ఇటీవలే తమిళనాడులో అధికారం చేపట్టిన జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు సాగుతున్నాయి. ఆ కుట్రలకు ‘ప్రాజెక్ట్ మేఘాలయ’గా పేరు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలకు భారీమొత్తంలో డబ్బులు ఆశ చూపినట్లు వార్తలొచ్చాయి. విప్‌ను ధిక్కరించిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్ చేశారని, కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదుతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదుచేశారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సన్నిహితుడు, కరూర్‌కి చెందిన డీఎంకే నాయకుడు కార్తి, ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని రమేశ్ సహా 9 మందిని శుక్రవారం అరెస్టు చేశారు. ‘ఈ కేసులో ఐపీడీఎస్ అనే ఒపీనియన్ పోల్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు చెన్నైకి చెందిన తిరునావుక్కరసు అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలో విజయన్ అనే జర్నలిస్ట్ ఎస్సెమ్మెస్లు పంపి ‘ప్రాజెక్టు మేఘాలయ’కు సహకరించారు. విజయన్ను రెండు రోజుల పాటు ట్రిప్లికేన్లో విచారించాం. అతని సెల్‌ఫోన్‌ను సైబర్ నిపుణుల విశ్లేషణకు పంపించామ’ని తమిళనాడు పోలీసులు వివరించారు. ఇంతకు ముందే డీఎంకే అధినేత…ఆరు నెలలే ఈ ప్రభుత్వం ఉంటుంది, ఎన్నికలకు సిద్దం కావాలని డీఎంకే శ్రేణులకు చెప్పిన విషయం ఇప్పుడు మళ్లా చర్చలోకి వచ్చింది. ఇదంతా డీఎంకే వెనుక ఉండి ఆడిస్తున్న వ్యవహారంగా చర్చ నడుస్తోంది.
విజయ్ సర్కారును కూల్చే కుట్రలు
- Advertisement -


