ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు
త్వరలోనే ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు ప్రకటించే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (డీఈఐ) సిబ్బంది అందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే వారందరికీ లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా (అమెరికా కాలమానం ప్రకారం) వారందరినీ వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీలను కూడా ఈ గడువులోగా పూర్తిగా తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.అలాగే డీఈఐ సంబంధిత శిక్షణ కార్యాక్రమాలను తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించారు. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను కూడా క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను అధికారులు తొలగించారు. కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే జన్మత: పౌరసత్వం రద్దు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి యూఎస్ఏ ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ట్రంప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.