ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భారత్ ప్రస్తుతం పాకిస్థాన్‌ను తక్షణ ప్రమాదంగా పరిగణిస్తోందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తెలిపారు.
అందుకే పాకిస్థాన్‌పై భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. అయితే దీర్ఘకాలికంగా చూస్తే రాజకీయ, ఆర్థిక,వాణిజ్య, సైనిక రంగాల్లో భారత్‌కు ప్రధాన పోటీదారు చైనానే అవుతుందని స్పష్టం చేశారు.తన కొత్త పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇప్పటికే పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు చేసిందని, ఈ రెండు దేశాలతో సరిహద్దు వివాదాలు కూడా ఉన్నాయని నరవణె పేర్కొన్నారు. అందువల్ల ఇరు దేశాలపై భారత్ నిరంతరం దృష్టి సారించాల్సి ఉంటుందని చెప్పారు.
చైనా భారత్‌కు ప్రధాన పోటీదారు
అయితే పాకిస్థాన్, చైనాల నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు ఒకేలా ఉండవని వివరించారు. రెండు దేశాల స్వభావం, వాటి నుంచి వచ్చే ముప్పుల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు కొనసాగుతున్నందున ఆ దేశాన్ని భారత్ తక్షణ సవాలుగా చూస్తోందని నరవణె చెప్పారు. మరోవైపు దీర్ఘకాలంలో చైనా భారత్‌కు ప్రధాన పోటీదారుగా మారుతుందని అన్నారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక వ్యవహారాలు వంటి అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పోటీ పెరగవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పోటీ ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు చోటుచేసుకోవడం సహజమేనని వ్యాఖ్యానించారు.
శాంతి కావాలంటే యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి
చైనాతో సమస్యలను ఎదుర్కొనే విషయంలో భారత్ బలమైన సైనిక ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని నరవణె సూచించారు. అదే సమయంలో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం కూడా కొనసాగాలని చెప్పారు. సైనికంగా బలంగా ఉండటంతో పాటు దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ముప్పు ఎదురైనా తిప్పికొట్టేలా భారత్ ఎప్పుడూ సైనికంగా సంసిద్ధంగా ఉండాలని నరవణె అన్నారు. ”శాంతి కావాలంటే యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజ జీవితంలోనైనా, భౌగోళిక రాజకీయాల్లోనైనా పొరుగు దేశాలను ఎంచుకునే అవకాశం ఎవరికీ ఉండదని చెప్పారు. అందువల్ల ఉన్న పరిస్థితుల్లో సాధ్యమైనంత మెరుగ్గా ఎలా వ్యవహరించాలనే దానిపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
2019 నుంచి 2022 వరకు భారత సైన్యాధిపతిగా నరవణె
పొరుగు దేశం అస్థిరత, అల్లకల్లోలంలో ఉంటే భారత్ కూడా పూర్తిగా స్థిరంగా ఉండలేదని నరవణె పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో శరణార్థుల సమస్య, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా వంటి అనేక సవాళ్లు ఎదురవుతాయని వివరించారు. అందుకే పొరుగు దేశాలు స్థిరంగా ఉండేందుకు అవసరమైన సహకారం అందించడం కూడా భారత్ ప్రయోజనాల్లో భాగమేనని అభిప్రాయపడ్డారు. జనరల్ మనోజ్ నరవణె 2019 నుంచి 2022 వరకు భారత సైన్యాధిపతిగా పనిచేశారు.


