తహసీల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న బహుజన సేన సమితి జిల్లా అధ్యక్షులు రాజు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండలంలో విలేకరుల ముసుగులో నకిలీ పట్టాల దందా నడుపుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బహుజన సేన సమితి జిల్లా అధ్యక్షులు రాజు సోమవారం ప్రజా గ్రీవెన్స్ లో తహసీల్దార్ వలిబాషా కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ ఎన్ ఐ రిజిస్ట్రేషన్ లేని పత్రికల పేరుతో నకిలీ విలేకరులుగా తిరుగుతూ అమాయక ప్రజలను, కింది స్థాయి అధికారులను డబ్బులు డిమాండ్ చేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. బదిలీ అయిన, రిటైర్డ్ అయిన తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేస్తూ నకిలీ పట్టాలను తయారు చేసి ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కింది స్థాయి అధికారులు మాట వినకపోతే సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని లక్షల్లో డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తహశీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలు తయారు చేస్తున్న వారిపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


